జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో చిన్న జిల్లాల ఏర్పాటు జరిగింది. జిల్లాలను విభజించి.. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి వంతున చిన్న జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా జగన్ అధికారంలోకి రాకముందే ప్రకటించారు తప్ప.. ఆ పని చేయడంలో ఆయన నానా గందరగోళానికి గురయ్యారు. ‘పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి’ అని తాను ప్రకటించిన విధానాన్ని కూడా పూర్తిగా అనుసరించలేదు. అలాగని.. శాస్త్రీయమైన పద్ధతిలోనూ విభజించలేదు. 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉండగా.. 26 జిల్లాలను ఏర్పాటు చేశారు.
భోగోళికంగా ఉండే అభ్యంతరాలను ఆయన పట్టించుకోలేదు. జిల్లాకేంద్రానికి, జిల్లా విస్తరించిన చివరి ప్రాంతాలకు సంబంధం లేకుండా ఉండేలా.. ఈ జిల్లాలు తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం జిల్లాల హద్దులను పునర్ వ్యవస్థీకరించేందుకు సిద్ధమవుతోంది. ప్రజలకు సౌకర్యంగా ఉండడం ఒక్కటే పరమావధిగా ఈ జిల్లాల హద్దులను ఏర్పాటు చేయబోతున్నట్టుగా నాయకులు ప్రకటిస్తున్నారు.
ఈ పునర్విభజవన క్రమంలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి కూడా. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఒక జిల్లాగా కూడా గుర్తించనున్నారు. అదే విధంగా ప్రస్తుతం అన్నమయ్య రాజంపేట జిల్లాలో భాగంగా ఉన్న మదనపల్లి కేంద్రంగా ఒక కొత్త జిల్లాను, తిరుపతి జిల్లాలో భాగంగా ఉన్న గూడూరు కేంద్రంగా మరో జిల్లా కూడా ఏర్పాటు కాబోతున్నట్టుగా కూడా ప్రతిపాదనలు తయారయ్యాయి. అమరావతి కేంద్రంగా ఒక జిల్లా ఏర్పడడం అనేది .. రాజధాని ప్రాంతానికి సముచిత గౌరవం అని కూడా పలువురు భావిస్తున్నారు. ఈ హద్దులను పునర్ వ్యవస్థీకరించే కసరత్తుకోసం చంద్రబాబు నాయుడు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటుచేశారు.
చిన్న జిల్లాల ఏర్పాటు విషయంలో గత ప్రభుత్వం తొందరపాటు చర్యలు, ఒత్తిళ్ల కారణంగా.. ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోకుండా ఏర్పాటుచేసిందని మంత్రి సత్యప్రసాద్ అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వినతిపత్రాలు ఇచ్చారని, రెండు బృందాలుగా జిల్లాల్లో కూడా పర్యటించిన తరువాత.. ప్రజలనుంచి కొత్తగా వినతలు, అభ్యంతరాలు కూడా స్వీకరించిన తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటాం అని అంటున్నారు.
డిసెంబరు చివరిలోగా జిల్లాల సరిహద్దుల మార్పు ప్రక్రియను పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఈ మంత్రి వర్గ ఉపసంఘం ఉన్నట్టుగా కనిపిస్తోంది. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ ల సరిహద్దులను మాత్రమే మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాల మార్పు ప్రధానాంశం కాగా, చాలా ప్రాంతాల్లో గ్రామాల నుంచి తమను మరొక మండలంలో కలపాలనే విజ్ఞప్తులు కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది.
