వైసీపీ సరికొత్త డ్రామా: రీపోలింగ్ బహిష్కరణ!

Friday, December 5, 2025

పోలింగ్ ముగిసిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కూడా దాదాపుగా ఖరారు అయింది. ఓడిపోతున్నామనే విషయం అర్థం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. పోలింగ్ మొదలైన కొన్ని గంటల తర్వాతనుంచి కూడా నానా యాగీ చేస్తూనే ఉన్నారు. రెండు మండలాలలో ప్రశాంతంగా పోలింగ్ జరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు పోలింగ్ కేంద్రాల్లో కొన్ని కారణాల వల్ల ఈసీ బుధవారం నాడు రీపోలింగ్ కు ఆదేశించింది. అయితే వైసీపీ ప్రారంభించిన కొత్త డ్రామా ఏంటంటే.. ఈ రోజు జరగబోతున్న రీపోలింగ్ ను వారు బహిష్కరిస్తున్నారట. రీపోలింగ్ లో పాల్గొనవలసింది ప్రజలే తప్ప.. పార్టీ వస్తే ఎంత? రాకపోతే ఎంత? అనే చర్చలు అక్కడ నడుస్తున్నాయి.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో 3, 15 నెంబర్లు గల పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అచ్చువెల్లి  గ్రామంలో 492 ఓట్లు, కొత్తపల్లి లో 1273 ఓట్లు ఉన్నాయి. ఈ రెండుచోట్లు రీపోలింగ్ జరుగుతోంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం పట్ల కూడా నిరసన వ్యక్తం చేస్తున్నది.

మంగళవారం పోలింగ్ నాడు రెండు మండలాల్లో వీలైనంత అల్లర్లు సృష్టించి పోలింగ్ ప్రక్రియకు అడ్డుపడాలని కుట్రలుచేసిన వైసీపీ దళాలు.. తమ పన్నాగాలు పారకపోయేసరికి ఇప్పుడు కొత్త పాట అందుకున్నాయి. ఈ రెండు మండలాల్లోనీ మొత్తం 32 పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరగాలని అంటున్నాయి. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ మొత్తం చోట్ల  కేంద్ర భద్రత బలగాలను రప్పించి మరీ మళ్లీ పోలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఇంతకు మించిన కామెడీ వ్యవహారం మరొకటి ఉండకపోవచ్చు.

రెండు మండలాల్లో చెదురుమదురు ఘటనలు ఒకటి  రెండు మినహా.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ పూర్తి కావడం వైసీపీ వారికి మింగుడుపడడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పులివెందులలో చేసినంత కాలం అరాచకం చేస్తూ వచ్చారు. ఒక్కటంటే ఒక్క ఎన్నిక పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరిగే సరికి వారు సహించలేకపోతున్నారు. గెలుపోటముల సంగతి తరువాత.. ముందు అసలు ఎన్నిక జరగడాన్నే వారు వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం నాటి పోలింగులో పులివెందులలో 76.44, ఒంటిమిట్టలో 81.5 శాతం పోలింగ్ నమోదు అయింది. ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో కూడా ఇంత మంచి పోలింగ్ శాతం నమోదు కావడం, తమ అహంకారానికి తగిలిన దెబ్బగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే అర్థం పర్థం లేకుండా ఇంత మంచి పోలింగ్ శాతం నమోదు అయిన తర్వాత కూడా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిణామాలను రికార్డు చేసిన తర్వాత కూడా.. ఈ ఎన్నికను పూర్తిగా రద్దు చేసేసి.. ఎన్నికల సంఘం మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్లు స్వీకరించి.. పూర్తిగా కేంద్ర బలగాల సాయంతో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కోరండం వైసీపీ నాయకుల చవకబారుతనానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles