టాలీవుడ్ కు కూటమి సర్కార్ సూపర్ గుడ్ న్యూస్!

Friday, December 5, 2025

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రస్తుతం చిన్నపాటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కార్మిక యూనియన్ల ఫెడరేషన్, నిర్మాతలకు మధ్య చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఇది త్వరలోనే ఏదో ఒక రూపంలో ఒక కొలిక్కి వచ్చే సమస్యే! కాకపోతే.. ఈ సంక్షోభం గురించి మాట్లాడడానికి కాదని అంటూనే.. తెలుగు సినిమా నిర్మాతల తరఫున కొందరు ప్రతినిధులు వెళ్లి.. ఏపీలోని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిశారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరారు గానీ.. వారి సమస్యల్ని తాను సీఎం దృష్టికి తీసుకువెళతానని కందుల దుర్గేష్ వారికి హామీ ఇచ్చారు. అయితే ఈ భేటీ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున టాలీవుడ్ కు ఒక సూపర్ గుడ్ న్యూస్ ను మంత్రి ప్రకటించారు.

ఈ ఏడాది నుంచే మళ్లీ నంది అవార్డులు ఇవ్వాలనే కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన చెప్పారు. నంది పురస్కారాలు, నాటకోత్సవాలు రెండింటినీ తిరిగి నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అలాగే.. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి తగిన విధంగా ఒక కొత్త పాలసీకి రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కూడా దుర్గేష్ వెల్లడించారు.

నిజం చెప్పాలంటే.. టాలీవుడ్ కు ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ లో నంది అవార్డులు ఇచ్చి దశాబ్దం గడచిపోయింది. అనేక కారణాల వల్ల.. నంది అవార్డులను ప్రకటించినా కూడా ప్రదానోత్సవం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా నంది అవార్డుల పేరుతో ఒక ప్రహసనం నడిపించారే తప్ప.. అవార్డులు ఇవ్వడం జరగలేదు.

ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత.. నంది అవార్డులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఈ ఏడాదినుంచే నంది అవార్డులు ఇవ్వడాన్ని పునఃప్రారంభించనున్నట్టు మంత్రి దుర్గేష్ పరిశ్రమ ప్రతినిధులతో చెప్పడం చాలా గొప్పవిషయం అని అంతా అనుకుంటున్నారు. కేవలం నంది అవార్డుల సంగతి మాత్రమే కాదు.. ఏపీలో సినీ పరిశ్రమ వేళ్లూనుకొనడానికి ఎవరు ముందుకు వచ్చినా అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని కూడా దుర్గేష్ తెలిపారు. డబ్బింగ్ స్టుడియోలు, రీరికార్డింగ్ స్టుడియోలు వంటివి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ సహకారం ఉంటుందని అంటున్నారు. ఒకవైపు హైదరాబాదులో చిత్రపరిశ్రమ రకరకాల కుదుపులకు గురవుతున్న ప్రస్తుత తరుణంలో.. ఏపీలో పరిశ్రమ కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతుండడం శుభపరిణామం అనే చెప్పాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles