సొంత చిన్నాన్న అత్యంత కిరాతకంగా హత్యకు గురైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిని చాలా తేలికగా తీసుకున్నారు. దర్యాప్తుగా సజావుగా సాగడం గురించి గానీ, దోషులను తేల్చి వారికి శిక్షలు పడేలా చేయడంలోగానీ ఆయన ఆయన శ్రద్ధపెట్టలేదు. చనిపోయింది స్వయంగా ఆయన చిన్నాన్న. తన ఎంపీ సీటును త్యాగం చేసి.. జగన్ ను పార్లమెంటుకు పంపిన వ్యక్తి. తనకు అనుకూలంగా నిత్యం ప్రజల్లో ప్రచారం చేస్తూ వచ్చిన వ్యక్తి. తండ్రికి స్వయానా తమ్ముడు. అలాంటి వివేకానందరెడ్డి హత్యకు గురైతే జగన్ వహించిన నిర్లిప్తత గురించి ఇప్పటికే అనేక పుకార్లున్నాయి. ఇప్పుడు నరెడ్డి సునీత చెబుతున్న మాటలను గమనిస్తే కొత్త అనుమానాలు పుడుతున్నాయి.
తన తండ్రి హత్య విషయంలో సీబీఐ ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని, అనేక కీలకాంశాలను దర్యాప్తులో అసలు పట్టించుకోకుండానే, వాటి జోలికి వెళ్లకుండానే.. దర్యాప్తు ముగిసినట్టుగా సుప్రీం కోర్టులో చెప్పడాన్ని సునీత అభ్యంతర పెడుతున్నారు. వివేకా హత్యకు గురైనప్పుడు.. బయటిప్రపంచానికి చెప్పడంకంటె ముందు చాలా కాల్స్ వైఎస్ జగన్ కు చేసి తెలియజెప్పారని, కాల్ రికార్డుల డేటా ద్వారా ఆ సంగతి తేలిందని తెలంగాణ హైకోర్టులో కూడా చెప్పిన సీబీఐ.. ఆ దిశలో దర్యాప్తు చేయలేదని సునీత ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ ను కూడా విచారించకుండా విచారణ పూర్తి కావడం సాధ్యం కాదన్నట్టుగా సునీత ధ్వనిస్తున్నారు. ఆమె వివరిస్తున్న అప్పటి తన స్వానుభవాన్ని గమనిస్తే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అంటే భయంతో బతుకుతున్నారేమో అనే అనుమానం కలుగుతుంది.
ఆమె చెబుతున్న ప్రకారం.. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత.. జగన్ , చెల్లెలు సునీతతో భీషన ప్రతిజ్ఞ చేశారట. హంతకులను పట్టుకుంటానని, అలా చేయకపోతే తనకు తీవ్ర అవమానమని జగన్ ఆమెకు హామీ ఇచ్చారట. అయితే అప్పట్లో కేసు బాధ్యతలు చూస్తున్న సిట్ విచారణ పర్వం మొత్తం ఒక కొలిక్కి తీసుకువచ్చిన తర్వాత.. జగన్ దానిని మార్చేశారట. ఇక్కడివరకు ఆగినా బాగుండేది. కానీ అసలు విషయం ఆతర్వాతే జరిగినట్టుంది. సునీత కోరినప్పటికీ కూడా.. సీబీఐ దర్యాప్తు వద్దని ఆయనే వారించారట. సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే.. అవినాష్ రెడ్డి పార్టీ మారిపోయే ప్రమాదం ఉంటుందని సునీతతో జగన్ అన్నారట. దాంతో జగన్ తనకు న్యాయం చేసే ఉద్దేశంతో లేరని సునీతకు అర్థమైందట.
అయినా.. ఒకవేళ తన చిన్నాన్న హత్య కేసులో నిందితులను తేలిస్తే లేదా, సీబీఐ విచారణకు ఆదేశిస్తే అవినాష్ రెడ్డి పార్టీ మారిపోతారేమో అని జగన్ అనుకుని ఉండవచ్చు గాక. కానీ.. అందుకు ఆయన భయపడాల్సిన జంకవలసిన అవసరం ఏముంది? అనేది సామాన్యులకు అర్థంకాని సంగతి. అవినాష్ రెడ్డి లేకపోతే తన పార్టీకి వేరే గతి లేదని భయపడే స్థితిలో జగన్ ఉన్నారా? అనేది ఇప్పుడు పుడుతున్న కొత్త సందేహం. అవినాష్ రెడ్డి గురించి అంతగా భయపడుతుండడం వల్లనే.. జగన్ తన సొంత చిన్నాన్న హత్యకేసును తేల్చడం గురించి పట్టించుకోని స్థాయికి దిగజారారా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో మొదలైంది.
