రష్మిక మందన్నా ఇటీవల వరుసగా విజయాలు అందుకుంటూ కెరీర్‌లో మంచి జోష్‌లో ఉంది. ‘పుష్ప 2’ విజయానంతరం, ‘కుబేర’తో మరో హిట్ అందుకున్న ఆమె, ఇప్పుడు మహిళా ప్రాధాన్య కథలతో బిజీగా ఉంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక, తన వ్యక్తిత్వం, భావోద్వేగాల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది.
ఆమె చెప్పిన ప్రకారం, తన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం పూర్తిగా వేర్వేరు అని అంటోంది. ఇంట్లో ఉండే తీరుతెన్నులు చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుందని, తాను నిజానికి చాలా భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తినని తెలిపింది. అయితే ఆ భావాలను బహిరంగంగా ప్రదర్శించకూడదని భావిస్తుందని చెప్పింది.
దీనికి కారణం, అభిమానులు లేదా ఇతరులు తన దయా స్వభావాన్ని బలహీనతగా భావించే అవకాశం ఉండటమేనని చెప్పింది. అలాగే, ఎవరైనా కెమెరాల కోసం మాత్రమే నటిస్తోందని అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తాయని అనిపిస్తుందని వివరించింది. తాను ఎంత నిజాయితీగా ఉంటే, అంత వ్యతిరేకత ఎదురవుతుందని అనుభవంతో తెలుసుకున్నందువల్లే తన భావాలను ఎక్కువగా దాచుకుంటానని చెప్పింది.
అదే సమయంలో, తన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకు కృషి చేస్తూ, మానసికంగా దృఢంగా ఉండాలని ప్రయత్నిస్తోందని రష్మిక వెల్లడించింది.
