పోలింగ్ కేంద్రాల మార్పుతో అంత భయం ఎందుకో?

Saturday, December 6, 2025

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం! రాష్ట్రంలో మారిన పరిస్థితులు, వైఎస్సార్ కాంగ్రెస్ కుటిల రాజకీయాలను ప్రజలు ఛీకొడుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని తాము దక్కించుకోగలం అనే టీడీపీ ఆత్మవిశ్వాం కలిసి ఈ ఎన్నికపై అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికను ఆషామాషీగా తీసుకోలేదనడానికి నిదర్శనంగా.. పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతా రెడ్డి స్వయంగా ఇక్కడ పోటీచేస్తున్నారు. అదే  సమయంలో వివేకా కూతురు సునీత సోదరుడు సురేష్ రెడ్డి కూడా ఇండిపెండెంటుగా పోటీచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వారిలో జడుపు పుట్టిస్తున్నారు. ఇన్ని పరిణామాల మధ్య.. వైకాపా వారికి మరో కొత్త భయం కూడా పట్టుకుంది. అదే పోలింగ్ కేంద్రాల మార్పు చూపించగల ప్రభావం!

పులివెందుల మండలంలో 6 నుంచి 11 వరకు మొత్తం ఆరు పోలింగ్ కేంద్రాలను అధికారులు మార్చారు. అయితే కేవలం ఈ పోలింగ్ కేంద్రాల మార్పు గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చాలా గొడవ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల మార్పు అనేది చాలా చాలా చిన్న విషయం అయినప్పటికీ.. దానితో ప్రజాస్వామ్యానికి ద్రోహం జరుగుతున్నట్టుగా వారు ఆందోళనలకు ప్రయత్నిస్తున్నారు. కేవలం పోలింగ్ కేంద్రాలు మార్చడంతోనే వారు ఇంతగా భయపడుతుండడానికి ఒక కారణం ఉంది.

ఈ ఆరు పోలింగ్ కేంద్రాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలో కూడా సాలిడ్ గా రిగ్గింగ్ చేసుకునే బూత్ లుగా ముద్రపడినటువంటివి. ఆ బూత్ లలో ఒక్కటి కూడా మిస్ కాకుండా కొందరు వ్యక్తులే ప్రతి ఎన్నికల్లోనూ అన్ని ఓట్లను పోల్ చేసేసుకుంటూ ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతి. ఈ రిగ్గింగ్ దందాకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు ఈ దఫా బూత్ లను మార్చారు. అలాగే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తమ రిగ్గింగ్ దందా సాగదు అని అర్థమయ్యేసరికి, ఓటమి తప్పదేమో అని వైసీపీ దళాలు భయపడుతున్నాయి. దాంతో.. కేవలం పోలింగ్ కేంద్రాల మార్పు వంటి సాధారణమైన విషయానికి ఈసీ వద్దకు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు.
ఈ మార్పు వలన ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం సాధ్యం కాదని పాపం జగన్ దళాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు బెంగుళూరు, హైదరాబాదు సహా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్న ఓటర్లకు ప్రత్యేక సొంత వాహనాల్లో తరలి పోలింగ్ నాటికి రావడం కోసం ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి నానా హంగామా చేస్తున్నారు. అలాంటిది.. ఎక్కడెక్కడినుంచో ఓటర్లు వస్తుండగా.. మార్చిన పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా ఉంటారా? అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. కేవలం తమ రిగ్గింగ్ దందా తాము అనుకున్నట్టుగా జరగదు గనుక.. ఈ విషయంలో వైసీపీ నానా యాగీ చేస్తున్నట్టుగా అర్ఖథమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles