తెలుగు రాష్ట్రాలకు ఈ రాఖీ పండగ ఓ రాజకీయ వెరైటీ!

Monday, December 8, 2025

‘రక్షాబంధన్’.. అక్కచెల్లెళ్లు ఆత్మీయంగా తమ సోదరుడి చేతికి రక్షాబంధన్ కట్టి.. తమ ప్రేమను ఆత్మీయతను కనబరిచే పండగ ఇది. తెలుగురాష్ట్రాల్లో కూడా ఈ రక్షాబంధన్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎంతెంతో దూరప్రాంతాల్లో ఉండే అక్కచెల్లెళ్లు కూడా.. శ్రమకోర్చి తమ సోదరులు ఉండే ఊర్లకు వచ్చి.. వారికి రక్షాబంధన్ కట్టి వెళుతుంటారు. ప్రత్యేకించి.. ఈ పండుగ రోజుల్లో ఆర్టీసీ బస్సులు కూడా మహిళల రద్దీతో కిటకిటలాడిపోతుంటాయంతే అతిశయోక్తి కాదు.

ఇంకో సంగతి కూడా చెప్పుకోవాలి. ఏ రంగంలో నైనా అంతో ఇంతో సెలబ్రిటీలుగా వెలుగుతున్న వాళ్లందరూ కూడా.. తమ రక్షాబంధన్ వేడుకల సెలబ్రేషన్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అందరికీ స్ఫూర్తి ఇస్తారు. మన తెలుగురాష్ట్రాలకు సంబంధించి రాజకీయంగా రక్షాబంధన్ కు చాలా క్రేజ్ ఉంది. ఎందుకంటే.. ఎంతో క్రేజ్ ఉన్న యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి- షర్మిల, కల్వకుంట్ల తారక రామారావు- కవిత లు ఉన్నారు. వీరి ఇళ్లలో రక్షాబంధన్ అనేది రాష్ట్రానికంతా.. ఎట్ లీస్ట్ వారి పార్టీ కార్యకర్తలకంతా పండగలాగా జరిగేది. కానీ.. కొన్నేళ్లుగా ఈ పండగ సగం మసకబారింది. ఎందుకంటే.. ప్రతిసంవత్సరం అన్నయ్య జగన్ కు రక్షాబంధన్ కంటి.. మిఠాయి తినిపించి.. శుభాకాంక్షలు చెప్పే.. వైఎస్ షర్మిల.. ఆ పనిచేసి కొన్ని సంవత్సరాలు గడచిపోయింది. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయి. తనకు అన్నయ్య అన్యాయం చేశాడని దూరం జరిగిన షర్మిల.. రక్షాబంధన్ కట్టడం మానుకున్నారు.

కానీ తెలంగాణలో పరిస్థితి అది కాదు. గత ఏడాది వరకు కూడా కేటీఆర్- కవితలు హేపీగా రక్షాబంధన్ జరుపుకుంటూ వచ్చారు. తాను చేసే ప్రతి పనికి కూడా రాజకీయంగా మైలేజీ కోరుకునే కల్వకుంట్ల కవిత.. కేటీఆర్ కు రాఖీ కట్టిన ప్రతి సందర్భంలోనూ, దాని వెంబడి ఒక గిఫ్టు కూడా ఇచ్చి బాగా ప్రచారం చేసుకునే వారు. సాధారణంగా చెల్లెలు రాఖీ కడితే అన్న గిఫ్టు ఇవ్వాలి. కానీ.. కవిత తానే రాఖీ కట్టి.. తానే హెల్మెటు వంటి గిఫ్టు ఇచ్చేవాళ్లు. తద్వారా.. రాష్ట్రప్రజలందరూ హెల్మెట్ వాడకం అలవాటు చేసుకోవాలని ఆమె హితోపదేశాలు చేసేవారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ సమయానికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ అన్నాచెల్లెళ్ల మధ్య కూడా ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

వైఎస్ జగన్- షర్మిల లాగా వారు పరస్పరం తిట్టుకోవడం లేదు గానీ.. అంతకంటె ఘోరంగా ఒకరినొకరు రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత, తన అన్నయ్య కేటీఆర్ మీద పరోక్ష విమర్శలతో విరుచుకుపడుతూ.. ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. పక్కలో బల్లెంలాగా మారుతున్నారు. ఈ ఏడాది కవిత కూడా రక్షాబంధన్ కట్టడం లేదు. ఆ పనిచేయడానికి అసలు ఆమెకు అందుబాటులోనే ఉండకుండా కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పండగపూట సాయంత్రానికి కూడా ఆయన హైదరాబాదు రాకపోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ రక్షాబంధన్ సెలబ్రేషన్ తప్పించుకోవడానికే, చెల్లెలికి ఎదురుపడకుండా ఉండడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్టు గుసగుసలున్నాయి.

మొత్తానికి ఈ ఏడాది రక్షాబంధన్ రాజకీయంగా పేలవంగా జరుగుతున్నట్టే లెక్క. అదే సమయంలో.. తెలంగాణలో మహిళా మంత్రులందరూ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకున్నారు. మంగళగిరి మహిళలే తనకు అక్కచెల్లెళ్లు అని వారితో రాఖి కట్టించుకున్న లోకేష్ తేల్చేశారు. కవిత- షర్మిలలకు మాత్రం ఈ ఏడాది చాన్స్ లేకుండా పోయింది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles