ఈ కేసు తేలితే వారి పాత బెయిలు రద్దయినట్టే!

Friday, December 5, 2025

వైఎస్ భాస్కర రెడ్డి, దేవిరెడ్డి శివశంకర రెడ్డి ల పేర్లు గుర్తున్నాయా? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులుగా తేలి రిమాండుకు వెళ్లిన వ్యక్తులు వారు. భాస్కర రెడ్డి… ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డికి స్వయంగా తండ్రి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీకి అత్యంత సన్నిహితుడైన విశ్వసనీయుడైన అనుచరుడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం బెయిలు మీద బయట ఉన్నారు. కండిషనల్ బెయిలు కావడంతో ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటున్నారు. వీరిద్దరికీ పులివెందుల పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి.. విచారణకు రావాల్సిందిగా పిలిచారు. ఇంతకూ వారిమీద నమోదైన తాజా కేసు ఏమిటి?
ఇటీవల పులివెందుల మండలానికి చెందిన విశ్వనాథరెడ్డి అనే ఒక వైసీపీ కార్యకర్త తెలుగుదేశంలో చేరారు. రాష్ట్రంలో వైసీపీ నుంచి నాయకులు తెలుగుదేశంలోనో, కూటమి పార్టీలలోనో చేరడం విశేషం ఎంత మాత్రమూ కాదు. ఇబ్బడిముబ్బడిగా చేరుతూనే ఉన్నారు. వైసీపీకి భవిష్యత్తు లేదని భయపడుతున్నవారంతా కూటమి పార్టీలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. పోయిన వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. అదే సమయంలో ఉన్నవారు పార్టీ వీడకుండా.. వారికి 2.0 పాలన గురించి రకరకాల ఆశలు కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సొంత మండలానికి చెందిన నాయకుడే తెలుగుదేశంలో చేరడం పరువు తీసే వ్యవహారంగా మారింది.

సహజంగానే వైఎస్ అవినాష్ రెడ్డి ఈ విషయంలో సీరియస్ అయ్యారు. అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, మరో నేత గంగాధర రెడ్డి సదరు పార్టీ మారిన నేత విశ్వనాథరెడ్డికి ఫోనుచేసి బెదిరించారు. అక్కడితో ఆగినాసరిపోయేది. బెయిలుపై బయటకు వచ్చి హైదరాబాదులో ఉంటున్న అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర రెడ్డి, అవినాష్ అనుంగు సహచరుడు శివశంకర్ రెడ్డి కూడా బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నలుగురిపై  పోలీసులకు ఫిర్యాదు అందింది. పర్యవసానంగా హైదరాబాదులో బెయిలుపై ఉంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వారికి 41ఏ నోటీసులు అందాయి.

మూడురోజుల్లో వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ కేసులో వారు గానీ, వారి పేరిట గానీ నిజంగానే బెదిరింపులు జరిగినట్టుగా తేలితే.. వారికి గడ్డుకాలం దాపురించినట్టే. విశ్వనాథరెడ్డి ఫోను కాల్ రికార్డింగులు కూడా పోలీసులకు ఇచ్చారని వినిపిస్తున్న నేపథ్యంలో.. వారి బెయిలుకు గండం వచ్చినట్టేనని అంతా అనుకుంటున్నారు. స్వయంగా అవినాష్ రెడ్డి పీఏ కూడా ఇందులో నిందితుడు అయినందున.. ఆయన బెదిరింపులకు అవినాష్ రెడ్డిని కూడా కారణంగా భావించే ప్రమాదం ఉంది. సుప్రీంలో బెయిలు రద్దు పిటిషన్ విచారణలో ఉంది. అది తర్వాతి వాయిదా నాటికి ఈ కేసులో పాజిటివ్ గా తేలితే.. వారందరూ మళ్లీ కటకటాల వెనక్కు వెళ్లాల్సి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles