వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్ర కలిగిన శవరాజకీయం ఎలా ఉంటుందో తెలియజెప్పే మరో దారుణమైన ఉదాహరణ ఇది. గత ఏడాది ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ పరామర్శల యాత్రలకు వెళుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. తన పార్టీకి చెందిన వారు ఎవరెవరు చనిపోతారా అని ఆయన ఎదురుచూస్తున్నట్టుగా పరామర్శల యాత్రలు సాగుతుంటాయంటే అతిశయోక్తి కాదు. ఏడాది కిందట చనిపోయిన వారిని కూడా ఇప్పుడు పరామర్శించడానికి వెళ్లి.. మళ్లీ ఇద్దరిని బలితీసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఆయన తీరును గమనించిన వారు.. జగన్ శవరాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ తరహా రాజకీయాలు చిల్లర జుజుబీలే అని చెప్పాలి. శవం కనబడితే చాలు, ముందుగా ఆయన మైండ్ లోకి దానివలన రాజకీయ మైలేజీకి ఎలాంటి అవకాశం లేదా ప్రమాదం ఉంది.. అనే ఆలోచన మాత్రమే వస్తుందని అర్థమవుతోంది. 2019లో హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత చెబుతున్న అప్పటి కొన్ని సంగతులను గమనిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది.
‘నాన్న మరణించిన తర్వాత శవయాత్ర నిర్వహించాలని అడిగితే.. మా అన్న (జగన్) వద్దన్నారు.’ అని సునీత తాజాగా వెల్లడించారు. తన తండ్రి జయంతి సందర్భంగా ఆయన సమాధికి నివాళులు అర్పించడానికి వెళ్లిన సునీత ఈ ఆవేదన బయటపెట్టారు. అంత్యక్రియలకు ఎవరూ రాకముందే.. అన్నీ సర్దేసి, ఆ ప్రక్రియ మొత్తం త్వరగా పూర్తి చేసేయడానికి ప్రయత్నించారని సునీత అంటున్నారు. వివేకా అభిమానులు అందరికీ సమాచారం తెలిసి, అందరూ వచ్చే వరకు ఆగి, శవయాత్ర నిర్వహించాలని ఆమె కోరినా కూడా అందుకు జగన్ అభ్యంతరం చెప్పారట. ఇంతకూ, సునీత మాటల ప్రకారం, శవయాత్ర వద్దనడానికి ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా.. శవయాత్రకు జనం తక్కువగా వస్తే బాగోదని, అందుకని దగ్గరి మార్గంలో తీసుకెళ్లి త్వరగా పూర్తిచేసేద్దాం అని అన్నారట.
అంటే ఏమిటి? వివేకా శవయాత్రకు జనం తక్కువగా వస్తే.. తమకు ప్రజాదరణ తక్కువగా ఉన్నదని ప్రజలు అనుకుంటారేమో అని జగన్ భయపడ్డారన్నమాట. దగ్గర్లోనే ఎన్నికలు ఉండడంతో.. జనం తక్కువగా వస్తే పొలిటికల్ మైలేజీ దెబ్బతింటుందని సునీతను వారించారన్నమాట. ఇంతకంటె దిగజారుడు శవరాజకీయం మరొకటి ఉంటుందా? అనేది ప్రజల సందేహం.
ఈ మాటలు విన్న వారికి మరో అనుమానం కలుగుతోంది. నిజానికి శవయాత్ర కోసం ఆగితే.. వివేకా అభిమానులు పెద్దసంఖ్యలో వస్తే.. ఇక్కట్లు తప్పవని జగన్ భయపడి ఉండవచ్చు. ఎక్కువ సమయం ఆగే కొద్దీ.. వివేకా హత్యపై అభిమానుల్లో అనుమానాలు పెరిగి, అక్కడే ఎవరైనా నిలదీసి, ఆందోళన జరిగితే గనుక.. తనకు, తన ప్రియమైన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డికి రాజకీయ సమాధి తప్పదని కూడా జగన్ భయపడి ఉండవచ్చు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి తన సొంత బాబాయి చావు విషయంలో కూడా రాజకీయ మైలేజీని మాత్రం ప్లాన్ చేసుకున్న వ్యక్తిగా జగన్, సునీత మాటలను బట్టి, ప్రజల దృష్టిలో చులకన అవుతున్నారు.
వివేకా శవయాత్ర వేళ.. జగన్ ‘రాజకీయ మైలేజీ టెన్షన్’!
Friday, December 5, 2025
