టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అనుష్క కొత్త చిత్రం ‘ఘాటి’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. చాలా రోజులుగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి క్రైమ్, యాక్షన్ మేళవింపుతో రూపొందించారు అనుష్క ఇప్పటివరకు చూడని లుక్‌లో, ప్రత్యేకమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ చూసినా ఈ సినిమా పూర్తిగా హై వయొలెన్స్‌తో సాగుతోందని తెలిసిపోతుంది.
తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌లో మరింత గట్టిగా యాక్షన్ సన్నివేశాలు చూపించారు. గంజాయి సరఫరా చేసే రఫ్ క్యారెక్టర్‌లో అనుష్క తన నటనతో బాగా ఆకట్టుకుంది. ట్రైలర్‌లో చూపించినది కేవలం ఒక పార్ట్ మాత్రమేనని, అసలు కథలో ఇంకా ఎక్కువ డ్రామా, ఎమోషన్, యాక్షన్ కలసి ఉండబోతాయని తెలుస్తుంది.
ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ నాగవెల్లి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది.
