మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా తన పార్టీ కార్యకర్తల కోసం ఒక కొత్త యాప్ తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. తమ తమ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎవరైనా తమకు అన్యాయం చేసినా, అధికారులు తమ మాట వినకపోయినా అందులో ఫిర్యాదు చేయవచ్చునట. జగన్ అధికారంలోకి రాగానే వారి భరతం పడతారట. జగన్ చాలా ఆర్భాటంగా ప్రకటించారు గానీ.. ఈ ఏర్పాటు పట్ల ఆ పార్టీ కార్యకర్తల్లోనే అసహ్యం వ్యక్తం అవుతోంది.
ఈ రకం ఏర్పాటు ‘‘మీకు దాహం వేస్తే చెప్పండి.. మేం నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం. అప్పుడు బావులు తవ్విస్తాం.. మీ దాహం తీరుస్తాం’ అని చెబుతున్నట్టుగా ఉన్నదని సొంత పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. జగన్ బుర్రలో కార్యకర్తల సంక్షేమం గురంచి పుట్టిన అతి గొప్ప ఆలోచన ఇదేనా? అని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కార్యకర్తలకు ఏం కావాలో.. వారి ఏ రకంగా భరోసా ఇవ్వాలో, దైర్యం చెప్పాలో కూడా జగన్ కు కనీసం అవగాహన లేదని విమర్శిస్తున్నారు. జగన్ కు నిజంగానే కార్యకర్తల గురించిన శ్రద్ధ ఉంటే.. తాము కోరుకుంటున్న ఒక ఏర్పాటు చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. అదేంటంటే..
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా తమ తమ కార్యకర్తలను మీరు రెచ్చిపోండి ఎక్కడా తగ్గవద్దు.. ప్రభుత్వాన్ని చీల్చి చెండాడండి.. జగనన్న మీ ప్రాంతానికి వస్తే రప్పారప్పా నరుకుతాం ఫ్లెక్సిలతో ఊరేగండి.. అనే తరహాలో రెచ్చగొట్టే తీరులో వ్యవహరిస్తున్నారు. వీరి రెచ్చగొట్టే మాటలు సహజంగానే కార్యకర్తల్లో ఒక వర్గం మీద దుష్ప్రభావం చూపిస్తాయి. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తల్ని ఇలాగే రెచ్చగొట్టారు. అధికారం తమదే అని కదా.. అని జగన్ అనుచరులు.. చివరికి జగన్ తల్లి, చెల్లితో సహా అందరి మీద అసభ్య పోస్టులు పెట్టారు. వాటి తాలూకు పాపఫలితాలు వారికి ఇప్పుడు కనిపిస్తున్నాయి. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. జైళ్లకు వెళ్లాల్సి రావడంతో.. అప్పట్లో పాపాలు చేసిన చాలా మంది తెలివి తెచ్చుకుని దారికి వచ్చారు. ఇప్పుడు మల్లీ వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారు.
అయితే మీరు యాప్ ద్వారా మాతో వివరాలు నమోదు చేయించుకుని అయిదేళ్ల తర్వాత పొరబాట్న మళ్లీ అధికారంలోకి వస్తే.. ఏదో చేసి ఉద్ధరిస్తాం అని, వారి మీద కక్ష తీర్చుకుందాం అని చెప్పడం కాదు.. కార్యకర్తల కోసం ఇప్పుుడు ఏం చేయగలరో చెప్పండి అని వారు అడుగుతున్నారు. కార్యకర్తల మీద పొరబాటుగా కేసులో నమోదు అయితే.. పార్టీ ఏం చేస్తుందో యాప్ లో ఉండాలని అంటున్నారు. ఎవరిని సంప్రదించాలో, తమకు స్థానికంగా న్యాయసహాయం అందించే పార్టీ న్యాయవాదుల వివరాలు లాంటివి యాప్ లోఇవ్వాలని అడుగుతున్నారు.
తమ మీద కేసులు వచ్చినప్పుడు యాప్ లో ఆ కష్టం చెప్పుకుంటే.. వారి లాయరు ఖర్చులన్నీ పార్టీనే భరించే వ్యవస్థీకృత ఏర్పాటు కూడా ఉండాలని కోరుతున్నారు. అలాంటి సాయం అందించకుండా.. మీరు పితూరీలు చెప్పండి.. అయిదేళ్ల తర్వాత వారిని రప్పా రప్పా నరుకుతాం అని అంటే.. అప్పటిదాకా మా మనుగడ ఎలాగ అనే ప్రశ్న కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. మరి తాను తలచింది మాత్రమే చేసుకుంటూ పోయే జగన్మోహన్ రెడ్డికి.. కార్యకర్తల ఆక్రందనలు వినిపిస్తాయో లేదో!
