కన్నడలో ‘కాంతారా’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లోకూ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు భాషల్లో ప్రాజెక్టులు చేస్తున్న ఈ టాలెంటెడ్ హీరోకి తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఈసారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్నాడు.
ఈ ప్రాజెక్టును సితార కాంపౌండ్ 36వ చిత్రంగా అధికారికంగా ప్రకటించింది. దీని దర్శకుడు అశ్విన్ గంగరాజు అనే కొత్త టాలెంట్. విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే, ఇది సాధారణ సినిమా కాదనిపిస్తోంది. పోరాట భూమి నడుమ ముసుగు ధరించిన వ్యక్తి, వెనుక రెండు కత్తులతో సిద్ధంగా ఉన్న దృశ్యం పోస్టర్‌లో కనిపించింది. దీంతో ఈ సినిమా ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోందనే అంచనాలు మొదలయ్యాయి.
ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో మంచి ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు కానీ ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం ఇది రిషబ్ శెట్టికి తెలుగులో మరో పెద్ద మైలురాయిగా నిలవనుంది.
