నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నా, సామాజిక సేవల విషయంలో కూడా తాను ఎంత నిబద్ధతతో ఉంటారో మరోసారి నిరూపించారు. ప్రస్తుతం బాలయ్య “అఖండ 2” సినిమా పనుల్లో మునిగిపోతూ ఉన్నప్పటికీ, తనపై, తన హాస్పిటల్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఒక కార్యక్రమం పేరుతో బాలకృష్ణ పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును ఉపయోగిస్తూ విరాళాలు సేకరిస్తున్నారని ప్రచారం జరగటం గమనార్హం. ‘బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’ అనే పేరుతో అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమానికి తాను ఏ విధమైన అనుమతిని ఇవ్వలేదని, ట్రస్ట్ బోర్డు కూడా దీనికి మద్దతివ్వలేదని బాలయ్య స్పష్టంగా తెలిపారు.
ఇలాంటి అనధికారిక కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేయొద్దని హెచ్చరించారు. బసవతారకం హాస్పిటల్ నిర్వహించే అధికారిక ఈవెంట్లు, విరాళాల ప్రకటనలు అన్నీ నేరుగా హాస్పిటల్ అధికారిక వేదికల నుంచే వెల్లడవుతాయని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం బసవతారకం పేరును వాడటం సరికాదని, ఎవ్వరైనా ఈ రకమైన తప్పుడు ప్రచారాల్లో భాగమవుతే, వారి మీద చట్టపరమైన చర్యలు తప్పవని సూచన చేశారు.
ఈ వ్యవహారంపై బాలయ్య ఫేస్బుక్ ద్వారా స్పందించడంతో, ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అభిమానులు, సామాన్యులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
