మద్యం కుంభకోణంలో ఇలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వతా.. ఆ పార్టీ నాయకులు ఇంతకంటె భిన్నంగా స్పందిస్తారని, మరో రకమైన వాదనతో ప్రజల ముందుకు వస్తారని రాష్ట్రంలో ఎవ్వరూ ఊహించలేదు. హైదరాబాదు సమీపంలోని ఫాంహౌస్ లో దాచిన లిక్కర్ వసూళ్ల సొమ్మును సిట్ పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత.. ఆ డబ్బుతో మాకు సంబంధం లేదు- అని చెప్పి అక్కడితో దులిపేసుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తారని అంతా అంచనా వేశారు. అనుకున్నట్టుగానే.. వైఎస్సార్ సీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లి ప్యాలెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ కూడా ఇదంతా పెద్ద కుట్ర అనే పాచిపోయిన పాటలనే ఆయన ఆలపిస్తున్నారు.
నాలుగరోజుల కిందట నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయిన లిక్కర్ కేసు నిందితుడు వరుణ్ పురుషోత్తం మంగళవారం దుబాయి నుంచి హైదరాబాదు ఎయిర్ పోర్టుకు రాగానే.. అక్కడే సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో చేసిన నేరం అంగీకరించిన.. వరుణ్ పురుషోత్తం, దోచుకున్న సొమ్ము ఎక్కడ ఉందో కూడా ఆ డంప్ గురించి వివరం బయటపెట్టేశారు. పోలీసులు ఆ ఫాంహౌస్ లో సోదాలు చేసి 12 అట్టపెట్టెల్లో ఉన్న 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు మాది కాదు.. అని చాటి చెప్పడానికి పేర్ని నాని చాలా పాట్లు పడుతున్నారు.
2024 జూన్ నుంచి ఆ డబ్బు అక్కడే ఉన్నదని చెబుతున్నారు. అదే సమయంలో రాజ్ కెసిరెడ్డి మహా మేధావి అని లిక్కర్ కుంభకోణంలో కింగ్ పిన్ అని అంటున్నారు. అంత తెలివైన నేరస్తుడు అయితే.. అంత డబ్బును అట్టపెట్టెల్లో నిల్వచేసి పెడతాడా? అని నాని ప్రశ్నిస్తున్నారు.
నగదు డంప్ దొరికిన గెస్టు హవుస్ వేరేవాళ్లదని వాళ్లకు ఇంకా అనేక వ్యాపారాలు ఉన్నట్టుగా సిట్ పోలీసులే చెబుతున్నారని.. అక్కడ దొరికిన డబ్బు వారి వ్యాపారాలకు సంబంధించినది అయి ఉండొచ్చు కదా అని పేర్ని నాని ఒక కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. తద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ డబ్బుతో సంబంధం లేదని, ఈ కేసులో ఏ ఆధారాలు దొరకడం లేదు గనుక.. ఎక్కడో దొరికిన సొమ్మును లిక్కర్ స్కామ్ డబ్బుగా రంగుపులిమి చూపించడానికి పాట్లు పడుతున్నారని ఆయన అంటున్నారు.
అయితే పేర్ని నాని మాటలు హాస్యాస్పదంగా తయారయ్యాయి. ఆయన వాదన విని జనం నవ్వుకుంటున్నారు. అయినా మూడున్నర వేల కోట్లు దోచుకున్న వారికి 11 కోట్లు పోతే మాత్రం పెద్ద లెక్కేముందిలే అని జనం నవ్వుకుంటున్నారు. ఇవాళ పేర్ని నాని ఇలా మరొకరికి మీదకు నెట్టేసే మాటలు మాట్లాదవచ్చు గానీ.. ఆ ఫాంహౌస్ యజమానితో సహా అందరినీ విచారిస్తే అసలు తెరవెనుక ఉన్న వారెవ్వరో బయటకు వస్తుంది కదాని ప్రజలు అనుకుంటున్నారు.
అనుకున్నట్టే బొంకు: ఆ డబ్బుతో మాకేంటి లింకు!
Friday, December 5, 2025
