‘మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కాక తప్పదు’ అని ఇప్పటికే చాలామంది నాయకులు చాలా సందర్భాలలో చెబుతూ వచ్చారు. వైసీపీ నాయకులు అసలు లేని స్కామ్ లో తమ పార్టీ వారి మీద కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని అనడమూ, తెలుగుదేశం వారు జగన్ ను నిందించడమూ ఇది చాలా కామన్. కానీ.. కొత్తగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన పీవీఎన్ మాధవ్ ఇప్పుడు జగన్ అరెస్టు గురించి ఢంకా బజాయించి చెబుతున్నారు. మద్యం కుంభకోణంలో వైసీపీ అధినేత ఖచ్చితంగా అరెస్టు అవుతారని, ఈ కేసులో ఆయన జైలుకెళ్లక తప్పదని జోస్యం చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తోంటే.. వాటిని లోగా అన్వయించుకుని చూసినప్పుడు మాధవ్ జోస్యం త్వరలోనే నిజమవుతుందని అనిపిస్తోంది.
మద్యం కుంభకోణంలో 41 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ప్రిలిమినరీ చార్జిషీటు కూడా దాఖలైంది. వసూళ్ల పర్వం నడిపించిన వారు, వారి నుంచి ఆ సొమ్మను అందుకుని బిగ్ బాస్ కు చేర్చిన వారు… మొత్తం వ్యవహారానికి గైడెన్స్ గా నిలిచిన వారు అన్ని రకాల నిందితులూ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గట్టిగా చెప్పాలంటే ఇక జైలుకు వెళ్లకుండా మిగిలిఉన్న కీలక వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అనేది పలువురి మాట.
ఈనేపథ్యంలో జగన్, భారతి దంపతులు రెండు రోజుల కిందట పర్సనల్ గా వెళ్లి రాష్ట్ర గవర్నరుతో భేటీ కావడం అనేది చాలా కీలకమైన అంశంగా పలువురు భావిస్తున్నారు. ఎప్పుడు గవర్నరును కలిసినా సరే.. బయటకు వచ్చిన తర్వాత.. తనకోసం ఎదురుచూస్తూ ఉండే మీడియా వారితో కాసేపు మాట్లాడి.. ఆ సందర్భాన్ని చంద్రబాబునాయుడు మీద నిందలు వేయడానికి వాడుకునే జగన్మోహన్ రెడ్డి.. ఈసారి బయటకు వచ్చిన తర్వాత విలేకర్లు కేకలు వేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా, కారు ఆపనివ్వకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆయన లోపల గంటసేపు గవర్నరుతో గడిపి ఏం చర్చించారు..? అనే విషయమై అనేక సందేహాలు వ్యాప్తిలోకి వచ్చాయి.
ప్రధానంగా లిక్కర్ కుంభకోణంలో తన అరెస్టు జరగవచ్చునని, అరెస్టు ఉత్తర్వులు రాకుండా కాపాడాలని గవర్నరుకు విజ్ఞప్తి చేసి ఉంటారనే అనుమానం ఎక్కువ మందిలో ఉంది. మొన్నటిదాకా బయట మాట్లాడినట్టే గవర్నరు వద్ద కూడా ఆయన అసలు స్కామ్ జరిగినట్టుగా నిరూపించే ఆధారం ఒక్కటికూడా దొరకనేలేదని అని ఉండవచ్చు.
అయితే మొన్నటికి ఇవాళ్టికి పరిస్థితి మారిపోయింది. ఏకంగా 11 కోట్ల రూపాయలు, లిక్కర్ కుంభకోణంలో దోచుకున్న సొమ్ము ఫాంహౌస్ లో దాచి ఉంటే పోలీసులకు దొరికింది. ఇంతకు మించి అక్రమం జరిగినట్టుగా వేరే ఆధారాలు అవసరం లేదు. ఈ సొమ్ము పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో జగన్ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలాగా తయారైనట్టే. పీవీఎన్ మాధవ్ జగన్ అరెస్టు గురించి అంత ఘంటాపథంగా చెబుతుండడాన్ని కీలకంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. జగన్ కు కమలదళం పెద్దలనుంచి ఎలాంటి మద్దతు లభించబోదు అని అర్థం చేసుకోవడానికి మాధవ్ మాటలే నిదర్శనం అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక జగన్ అరెస్టు ఎప్పటికి జరుగుతోందనని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్ అరెస్టుపై ఆయన జోస్యం నిజమవుతుందా?
Friday, December 5, 2025
