మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు సాగించి… వందల కోట్ల రూపాయలు దోచుకున్న కేసులో జైల్లో ఉన్న తన కేబినెట్ సహచరుడు కాకాణి గోవర్దనరెడ్డిని ములాఖత్ లో కలిసి పరామర్శించడం జగన్ ఎజెండా. అదే సమయంలో.. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అత్యంత నీచంగా, అసభ్యంగా బూతులు తిట్టిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించడం కూడా మరో ఎజెండా అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి తనకు అలవాటు అయిన పద్ధతిలో ఈ పరామర్శల ములాఖత్ యాత్రను కూడా వీలైనంత రాద్ధాంతం చేయాలని అనుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఈ దఫా ఇంకొంచెం జాగ్రత్తగానే నిబంధనలు విధించారు. అయితే వాటిని ఉల్లంఘించడమే లక్ష్యంగా చెలరేగే జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో ఎంత యాగీ చేయాలనుకుంటున్నారనేది ఇప్పుడు చర్చ.
ములాఖత్ కు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంది. అదే సమయంలో ములాఖత్ వద్దకు వెళ్లడానికి పదిమందితో మాత్రం వెళ్లాలని పోలీసులు అనుమతి ఇచ్చారు. జైలు వద్దకు పార్టీ కార్యకర్తలు రావడానికి వీల్లేదని చెప్పారు. అలాగే రోడ్ షోను కూడా అనుమతించేది లేదని చెప్పారు. 30 యాక్ట్ అమల్లో ఉంటుందని.. రోడ్ల పక్కన జనాలు గుమికూడడానికి వీల్లేదని ప్లకార్డులు గట్రా ప్రదర్శించడానికి కూడా వీల్లేదని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. అదే సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డికి ఇంటికి వెళ్లదలచుకున్న జగన్ కు అక్కడకు మాత్రం 100 మందితో వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
నిజానికి పోలీసులు చాలా సహేతుకంగా అనుమతులు ఇచ్చినట్టు భావించాలి. ఎందుకంటే ములాఖత్ అనేది జనంతో చేయాల్సిన వ్యవహారం కాదు. జైల్లోములాఖత్ కు ఆల్రెడీ ముగ్గురికి మాత్రమే జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. అలాంటి నేపథ్యంలో అసలు జైలు వద్దకు జనం రావాల్సిన అవసరమే లేదు. కాబట్టి అక్కడకు పదిమందికే అనుమతి ఇచ్చారు.
ఈ తేడాను జగన్ కూడా గుర్తించాలి. పోలీసులు కొన్ని ఆంక్షలు విధిస్తే అందులో జగన్ ను తొక్కేయాలని అనుకోవడమేమీ ఉండదు. గత అనుభవాల దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఆంక్షలని పోలీసులు అంటున్నారు. జగన్ ముందు ఆప్షన్ ఉంది. కనీసం జీవితంలో ఒక్కసారి పోలీసుల నిబంధనలను అనుసరించి.. తోలించిన జనం లేకుండా ఒక యాత్ర సాగిస్తే ఎలా ఉంటుందో జగన్ చూడాలి. జనం తన కోసం వెల్లువలా వస్తున్నారనే అపోహలు జగన్ లో మిగిలి ఉంటే గనుక.. ఆయన తాను తిరిగే ప్రతిచోటా ఒక బహిరంగ సభకు అనుమతులు తీసుకుని.. అక్కడ ఒక వ్యవస్థీకృతమైన ఏర్పాట్లతో సభ పెట్టుకోవచ్చు. దానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోతే అప్పుడు నిందించవచ్చు. అంతే తప్ప.. పరామర్శ యాత్ర అ నే పేరు పెట్టి, అనుమతిలేని రోడ్ షోలు నిర్వహిస్తూ, ప్రజల ప్రాణాలను బలితీసుకుంటూ చెలరేగడం ఎందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తన జీవిత లక్ష్యం పోలీసులు ఏం చెప్పినా సరే దానిని అతిక్రమించడం మాత్రమే అన్నట్టుగా సాగకుండా జగన్ హుందాగా వ్యవహరించాలని అంటున్నారు.
అతి చేయొద్దు జగన్.. ఒక్కసారైనా పద్ధతిగా ఉండండి!
Saturday, December 6, 2025
