‘‘బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు!
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి’’
అనేది శ్రీశ్రీ రాసిన కవిత. తాను గొప్ప కవినని, సాహిత్య ప్రియుడినని.. తనకు తెలుగుభాష చాలా అద్భుతంగా వచ్చునని, తన మాదిరిగా శిష్టవ్యావహారిక భాషలో అంత్యప్రాసలు పేర్చుకుంటూ మాట్లాడగలిగిన నాయకుడు మరొకడు లేరని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి ఒక నమ్మకం. కానీ ఆయనకు ఎంతో పాపులర్ అయిన ఈ శ్రీశ్రీ కవిత మాత్రం సరిగా తెలియదు. కానీ తనను తాను సాహిత్యపిపాసిగా ప్రొజెక్టు చేసుకోవాలని ఆయనకు కోరిక ఎక్కువ. అందుకే పీ4 పథకం రూపంలో పేదల జీవితాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబునాయుడు ఒక సరికొత్త ఆలోచన చేస్తోంటే.. దాని గురించి, అది సక్సెస్ అయ్యే పథకం కాదంటూ శకునాలు పలుకుతున్నారు భూమన కరుణాకర రెడ్డి.
అందుకోసం ఈ శ్రీశ్రీ రాసిన పద్యాన్ని ఆయన కోట్ చేస్తున్నారు. బలవంతులు అనే పదాన్ని ఆయన ధనవంతులుగా మార్చుకున్నారు. తన తెలివితేటలు మొత్తం రంగరించి.. అసందర్భ ప్రేలాపన చేస్తూ.. 15 వేల ఏళ్ల మానవ చరిత్రలో ధనవంతులు, పేదలను బాగు చేయడానికి పనిచేసిన ఉదాహరణలు లేనేలేవని భూమన కరుణాకర రెడ్డి చెబుతున్నారు. అక్కడికేదో భూమన.. 15 వేల ఏళ్లుగా తాను ప్రపంచంలోని ప్రతి మనిషినీ గమనిస్తూ వచ్చి ఈ తీర్మానం చేస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ప్రకారం.. ధనవంతులు అంటే పేదలను దోచుకునే వాళ్లు మాత్రమే అట. వారు పేదల బాగుకోసం ఏ పనీ చేయరట. ఏ రూపాయీ ఖర్చు పెట్టరట.
అవకతవకగా పద్యం చెప్పి, అవతకవకగా దాని అర్థం చెప్పినా కూడా.. భూమన చెప్పింది ఒకవేళ నిజమేనని అనుకుందాం. ప్రపంచంలో ధనవంతులు 15వేల ఏళ్లుగా అలా ఉన్నారని.. ఇక వారిని ఎప్పటికీ అలాగే వదిలేయాలా? వారిలో మార్పు తీసుకురావడానికి అసలు ఎవ్వరూ ప్రయత్నించనే కూడదా? వారి ద్వారా పేదలకు మేలు జరగనే కూడదా? అనేది ప్రజల సందేహం. చంద్రబాబు చేస్తున్న అలాంటి ప్రయత్నాన్ని ఎందుకు హర్షించరు అని ప్రజలు అడుగుతున్నారు.
ఆ మాటకొస్తే.. జగన్ ని మించిన ధనవంతుడు, బలమైన వాడు రాష్ట్రంలో ీఎవరుంటారు? మరి ఆయన పేదలేను దోచుకోవడంకోసమే తాను ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడా? లేదా, శ్రీశ్రీ చెప్పినట్టుగా పేదలను బానిసలను చేసుకునేందుకు మాత్రమే అధికారం కోరుకుంటున్నారా? అనేది ప్రశ్న. భూమన మాటల ప్రకారం రాష్ట్రంలో అందరి కంటె పెద్ద దుర్మార్గుడు జగనే అని అనిపిస్తుంది. ఈ లెక్కన పేదల కోసం పనిచేస్తానని సుద్దులు చెప్పే వాళ్లంతా పేదల కంటె దరిద్రులు మాత్రమే అయి ఉండాలని భూమన సూత్రీకరిస్తున్నట్టుగా ఉంది.
పీ4 పథకం పట్ల విషం కక్కాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి నాయకులందరికీ పురమాయింపులు ఉన్నట్టుగా అర్థమవుతూనే ఉంది. కానీ భూమన లాంటి వాళ్లు ఇలా విషం కక్కడంలో కూడా తమ అతితెలివితేటలు ప్రదర్శిస్తూ అభాసుపాలవుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
భూమన మాటలు నిజమైతే పెద్ద దుర్మార్గుడు జగనే కదా?
Friday, December 5, 2025
