వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పరిపాలన ఎంత దుర్మార్గంగా సాగిందో తెలుసుకోవడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో అదానీ సంస్థలను ఆయన నెత్తినపెట్టుకుని, వారికి కావాల్సినట్టుగా తాను నిర్ణయాలు తీసుకోవడం కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకినుంచి సోలార్ పవర్ కొనుగోలు చేసే విషయంలో అదానీ సంస్థల నుంచి వందల కోట్ల ముడుపులు తీసుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా గతంలో సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే అదానీ సంస్థలకు మేలు చేయడానికి జగన్ అడ్డగోలుగా వ్యవహరించగలరని, అసలు మన రాష్ట్ర పరిధిలో వ్యవహారం ఉన్నదాలేదా కూడా చూసుకోకుండా అనుమతులు ఇచ్చేయగలరని కూడా తాజా దృష్టాంతం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ఒదిశా రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతంలో అత్యంత వివాదాస్పదమైన ప్రాంతంలో ఏ అభ్యంతరాలనూ పట్టించుకోకుండా.. అదానీ సంస్థలకు పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్తు కేంద్రాలను అదానీకి కట్టబెట్టడానికి గతంలో జగన్ సర్కారు ఇచ్చిన అనుమతులను కూటమి సర్కారు రద్దు చేసింది. తనకు వ్యక్తిగత లాభం చేకూర్చే డీల్స్ కుదుర్చుకోవడమే లక్ష్యం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తే.. ఆ తప్పులను కూటమి సరిదిద్దుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఏపీ ఒదిశా సరిహద్దుల్లో పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్కేంద్రాలు గిరిజనులకు దక్కాల్సి ఉంది. ఇవి పార్వతీపురం జిల్లా పరిధిలోకి వస్తాయి. రెండూ క లిపి 2200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతంపై ఆంధ్రా ఒదిశా రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. తమ రాష్ట్రానికి చెందిన గిరిజనులతో ఇక్కడ వాటిని నిర్మింపజేస్తాం అని ఒదిశా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపింది కూడా.
అయితే ఈ వివాదాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. 2022లో జగన్ అదానీ సంస్థలకు వీటి ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేశారు. గిరిజనుల హక్కులను కాలరాసే జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక గిరిజనులతో పాటు, ఒదిశా ప్రభుత్వం కూడా ఆందోళనకు దిగారు. తాజాగా ఈ అంశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. అప్పట్లో అదానీ కళ్లలో ఆనందం చూడడం కోసం జగన్ సర్కారు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఇంధనశాఖనుంచి రద్దు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అనుమతుల రద్దుతో గిరిజనులకు తలపెట్టిన అన్యాయాన్ని చక్కదిద్దినట్టు అయింది.
అదానీకి జగన్ ఇచ్చిన అనుమతులు రద్దు! ఎందుకంటే..
Friday, December 5, 2025
