కాంగ్రెస్ పెద్దలు కూడా శ్లాఘిస్తున్న చంద్రబాబు కృషి!

Wednesday, December 10, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం భూమి పూజలు మాత్రమే చేస్తారు. అంతే తప్ప ప్రాజెక్టులు కార్యరూపంలోకి  తీసుకు రావడం గురించి ఆయనకు శ్రద్ధ ఉండదు. ఏదో చేసేస్తున్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయంగతా పబ్బం గడుపుకుంటే చాలు.. ఆయనకు ఇంకే అక్కర్లేదు! ఇలా ప్రజలు అనుకోవడానికి మరో మంచి ఉదాహరణ కడపజిల్లాలో స్టీల్ ప్లాంటుకు ఆయన రెండుసార్లు భూమిపూజ చేసినా కూడా ప్లాంటు ప్రారంభం కాకపోవడమే. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం కడపజిల్లా సున్నపురాళ్లపల్లెలో జెఎస్‌డబ్ల్యు స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు అన్ని అనుమతులు, కేటాయింపులు పూర్తిచేసి త్వరితగిన కార్యకలాపాలు ప్రారంభం కావడానికి కృషి చేస్తోంది. చంద్రబాబునాయుడు సర్కారు చేస్తున్న కృషిని, విపక్షం కాంగ్రెసుకు చెందిన సీనియర్ నాయకుడు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి కూడా శ్లాఘిస్తున్నారు.

కడపజిల్లాలో స్టీల్ ప్లాంటుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయం అని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ పనులు వేగంగా పూర్తిచేసి జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని తులసిరెడ్డి కోరారు. తమాషా ఏంటంటే.. కడపజిల్లాలో స్టీల్ ప్లాంటు అనేది కొత్త ప్రతిపాదన కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడపలో స్టీల్ ప్లాంట్ పేరిట రెండు సార్లు హైడ్రామాలు నడిపించారు. 2019లో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ పేరుతో జగన్ అప్పట్లో ఒకసారి శంకుస్థాపన చేశారు. ఆ పనులు రెండేళ్ల పాటు ముందుకు సాగనేలేదు. జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి డీల్స్ వచ్చాయో, ఎలాంటి వత్తిడులు వచ్చాయో తెలియదు గానీ.. మొత్తానికి ఆ సంస్థ తమ పెట్టుబడి ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో జగన్ మరో సారి స్టీల్ ప్లాంటుకు భూమి పూజ చేశఆరు. ఈ సారి జెఎస్‌డబ్ల్యు సంస్థ స్టీల్ ప్లాంటు ఏర్పాటుచేస్తుందని ప్రజలను నమ్మించారు. ఏం జరిగిందో ఏమోగానీ ఆ పనులు కూడా ముందుకు వెళ్లలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టుగా ఉండిపోయింది.

తాజాగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సున్పురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టింది. అదే సంస్థ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
జగన్ ప్రభుత్వ కాలంలో భూమి పూజ జరిగినప్పుడు 3300 కోట్లతో తొలివిడత పనులు ప్రారంభించాలని నిర్ణయించగా, ఇప్పుడు కూటమి సర్కారు 4500 కోట్లపెట్టుబడితో స్టీల్ ప్లాంట్ తొలి దశ పనులు చేపట్టడానికి అనుమతులు ఇచ్చింది. రెండో దశ పనులను 11850 కోట్లతో చేపడతారని తెలుస్తోంది. 2026 జనవరిలోగా తొలిదశ పనులు ప్రారంభించాలని, 2029 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి కూడా ప్రారంభించాలని ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశించింది. 2031 జనవరిలో రెండో దశ ప నులు ప్రారంభించి, 2034 ఏప్రిల్ నాటికి రెండోదశ ఉత్పత్తిని కూడా ప్రారంభించాలని నిర్దేశించింది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడపజిల్లా మీద కపటప్రేమను ప్రదర్శిస్తూ వచ్చారని, కేవలం భూమి పూజలు చేయడం తప్ప పనులు ముందుకు తీసుకువెళ్లలేదని, కూటమి సర్కారు జెఎస్‌డబ్ల్యు సంస్థకు స్పష్టమైన డెడ్ లైన్లు విధించి పనులు ముందుకు తీసుకువెళ్లేలా చూస్తున్నదని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా కూటమి ప్రయత్నాల్ని అభినందించడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles