మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి గవర్నరు అబ్దుల్ నజీర్ ఇంటికి వెళ్లారు. గవర్నరుతో గంటకు పైగా భేటీ అయ్యారు. జగన్ వెంట.. పార్టీ కీలక నాయకులు కూడా పలువురు గవర్నరు వద్దకు వెళ్తారని తొలుత పుకార్లు వచ్చినప్పటికీ.. చివరకు జగన్ దంపతులు మాత్రమే వెళ్లారు. గవర్నరుతో వారు గంటకుపైగా సమావేశం అయ్యారు. ఈ ఏకాంత సమావేశంలో జగన్ దంపతులు గవర్నరుతో ఏం మాట్లాడారు? ఏం నివేదించుకున్నారు అనేది బయటకు రాలేదు. భేటీ తర్వాత రాజ్ భవన్ బయట వేచిఉన్న మీడియాతో ఒక్కమాటైనా మాట్లాడకుండానే జగన్ చల్లాగా అక్కడినుంచి జారుకున్నారు. దీంతో జగన్ భేటీపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం పరిపాలన సాగిస్తున్న కూటమి సర్కారు మీద పితూరీలు చెప్పడం, నిందలు వేయడం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు క్షీణించాయని చెప్పడం.. ఇవన్నీ సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో జగన్ వాడుకునే అంశాలు. గవర్నరును కలవడం దాకా వెళ్లిన తర్వాత.. రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉన్నదని కూడా ఆయన డిమాండు చేస్తుంటారు. తన పర్యటనలకు అనుమతులు ఇవ్వడంలో ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించే అవకాశం ఉన్నదని అందరూ ఊహించారు. అలాగే లిక్కర్ కుంభకోణంలో సిట్ దర్యాప్తు చాలా చురుగ్గా సాగుతున్న వేళ.. తమ పార్టీ నాయకులను కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని కూడా జగన్ గవర్నరుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నదని అందరూ ఊహించారు.
అయితే భేటీ తర్వాత పరిస్థితులను గమనిస్తోంటే.. జగన్ ఎజెండా అంశాలు ఇవి కాదు అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. ఎందుకంటే.. తనకు రాజకీయ మైలేజీకి వాడుకోదగిన ఇలాంటి అంశాల గురించి గవర్నరుకు ఫిర్యాదుచేస్తే గనుక.. జగన్ బయటకు వచ్చిన వెంటనే మీడియాను ఉద్దేశించి మాట్లాడి ఉండేవారని..ప్రభుత్వం మీద మరింతగా నిందలు వేసి ప్రజల దృష్టిలో సానుభూతి పొందేందుకు ప్రయత్నించేవారని అందరూ అనుకుంటున్నారు. జగన్ మీడియాతో మాట్లాడకుండా చల్లగా అక్కడినుంచి జారుకున్నారంటేనే దాని అర్థం లోపల భేటీలో ప్రస్తావించిన అంశాలు వేరు.. అని ఊహిస్తున్నారు.
లిక్కర్ కుంభకోణంలో అంతిమలబ్ధిదారు, బిగ్ బాస్ జగన్ అనే విషయం ఇప్పటికే సిట్ విచారణలో స్పష్టంగా బయటకు వచ్చినట్టుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రిలిమినరీ చార్జిషీటులో ఆయన పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ నిందితుల జాబితాలో ఆయన పేరు ఇంకా చేర్చనేలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తాను అరెస్టు కాకుండా చూడాలని గవర్నరు ద్వారా కాగల ప్రయత్నాలు చేయడానికి జగన్ దంపతులు వ్యక్తిగతంగా వెళ్లి కలిసినట్టుగా తెలుస్తోంది. భారతి ఆర్థిక వ్యవహారాలు మొత్తం చూస్తుండే గోవిందప్ప బాలాజీ కూడా లిక్కర్ కేసులో జైలులోనే ఉన్నారు. ఆయన ద్వారా.. ఈ స్కాం వెనుక, వసూళ్ల వెనుక భారతి హస్తం కూడా ఉన్నట్టు బయటకు వచ్చే అవకాశం ఉన్నదని, భారతి కూడా అరెస్టు కాకుండా ఉండేందుకే దంపతులు ఇద్దరూ వెళ్లి గవర్నరును వేడుకున్నట్టుగా ఉన్నదని పలువురు ఊహిస్తున్నారు.
గవర్నర్ తో గంటకు పైగా..: చల్లగా జారుకున్న జగన్!
Friday, December 5, 2025
