జనసేన పార్టీలో ఎమ్మెల్సీ నాగబాబుకు పార్టీ బాధ్యతల పరంగా ప్రమోషన్ లభించిందా? త్వరలోనే మంత్రి పదవిని కూడా స్వీకరించబోతున్న నాగబాబు.. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసే కీలక బాధ్యతలకు పునరంకితం కాబోతున్నారా? ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో జనసేనను బలోపేతం చేసే బృహత్కార్యం భుజాలకెత్తుకున్నారా? అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ‘నేను ఉత్తరాంధ్రలోనే ఉంటాను.. ఉతరాంధ్రలో మన పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేద్దాం’’ అని నాగబాబు పార్టీ కార్యకర్తలతో అంటుండడాన్ని గమనిస్తే ఇదే అనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మీద శ్రద్ధ పెట్టే కసరత్తులో ఉత్తరాంధ్రలో ఇది శ్రీకారం అని పలువురు అనుకుంటున్నారు.
నాగబాబు తొలినుంచి కూడా పార్టీ బలోపేతం మీదనే జనసేన కోసం పనిచేస్తూ ఉన్నారు. పవన్ కల్యాణ్ ఒక రకం నాయకత్వం నడుపుతూ రాగా.. క్షేత్రస్థాయిలో ప్తరి ఊరిలోనూ చిన్నచిన్న ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం.. పార్టీకి మద్దతు కూడగట్టడం వంటి పనులు నాగబాబు చేస్తూ వచ్చారు. ఆ రకంగా రాష్ట్రమంతా కూడా అనేక పర్యాయాలు పర్యటిస్తూ వచ్చారు.
2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన నాగబాబు.వ. 2024 ఎన్నికలు వచ్చేసరికి పొత్తుల్లో భాగంగా తాను పక్కకు తప్పుకుని తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం పూర్తి శ్రద్ధ పెట్టి పనిచేశారు పిఠాపురం ఎన్నిక మొత్తాన్ని తాను ఒంటిచేత్తో పర్యవేక్షించారు. ఆ తర్వాత కూడా.. పవన్ కల్యాణ్ డిప్యూటీసీఎం అయిన తర్వాత.. పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిగా నాగబాబు మాత్రమే ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ. చంద్రబాబునాయుడు కేబినెట్ ఖాళీలను పూరించడానికి పూనుకుంటే ఆయన మంత్రి కూడా! ఆ హోదాలోకి ప్రవేశించేలోగా.. పార్టీ విస్తరణ, బలోపేతం బాధ్యతలను భుజానికెత్తుకున్నట్టుగా కనిపిస్తోంది.
విశాఖపట్నంలో కార్యకర్తలతోభేటీ అయిన నాగబాబు వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. తాను ఉత్తరాంధ్రలోనే ఉంటానని, నెలలో ఐదు నుంచి పది రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలను కలుస్తానని ఆయన తేల్చి చెప్పారు. ఈ దామాషా విభజన ఆయన రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల మీద సమానంగా ఫోకస్ పెట్టడానికి, పార్టీ బలోపేతానికి శ్రద్ధ పెట్టడానికి అనువుగా ప్రకటించినట్టే ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.
నాగబాబు ఇప్పటివరకు పిఠాపురానికే పరిమితం అవుతూ వచ్చారు గానీ.. నెక్ట్స్ లెవెల్ లీడర్ గా పార్టీలో ప్రొజెక్టు చేసేందుకు పవన్ అన్ని ప్రాంతాల బాధ్యతలను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. త్వరలో రాష్ట్రంలో పంచాయతీలు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు రాబోతున్న తరుణంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం జనసేనకు చాలా అవసరం. ఇన్నాళ్లుగా ఉన్న బలహీనతను ఇప్పుడు దిద్దుకునేలా పార్టీ నిర్మాణం జరగాలని జగన్ తలపోస్తున్నారని, ఆ బాధ్యతలు నాగబాబు మీద పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నాగబాబుకు ప్రమోషన్.. పవన్ ఆ బాధ్యతలు ఇచ్చారా?
Friday, December 5, 2025
