ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల పూర్తిపదవీకాలం ఉంది. కానీ.. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు అవగాహన రాహిత్యంతోనో, అజ్ఞానంతోనో.. లేదో అబద్ధాలు చెప్పకపోతే.. పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోతుందనే భయంతోనో.. రెండేళ్లలో, మూడేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి.. నేను మళ్లీ సీఎం అవుతా అని అంటూ ఉంటారు. మరీ ఆయనంత చిత్రంగా చెప్పడం లేదుగానీ.. కడపజిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే ఇప్పుడు.. ఆ జిల్లాలో ఒక నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. ఎలా వస్తుంది? ఎలా సాధ్యం? అనే సంగతులు మాత్రం గుట్టు విప్పడం లేదు.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో బద్వేలు ఎమ్మెల్యే స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఉపఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకోవడానికి అంతా సిద్ధంగా ఉండాలని కూడా పిలుపు ఇచ్చారు. ఉప ఎన్నిక వస్తే.. కూటమి తరఫున పోటీచేసే అభ్యర్థులే గెలిచేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఆయన చెప్పడం బాగానే ఉంది కానీ… ఇప్పటికిప్పుడు బద్వేలు స్థానానికి ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది అనేదే పలువురికి అర్థం కావడం లేదు. ఆదినారాయణ రెడ్డిమాటలను బట్టి అనేక అనుమానాలు, ఊహల్లోకి వెళ్లిపోతున్నారు.
2019 ఎన్నికల్లో బద్వేలు నుంచి వైసీపీ తరఫున గుంతోటి వెంకటసుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మరణించడంతో దాసరి సుధను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంచుకుంది. 2021లో జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఎమ్మెల్యే అయ్యారు. 2024 లో కూడా అవకాశం ఆమెకే లభించింది. మళ్లీ గెలిచింది. కూటమి పొత్తుల్లో భాగంగా బద్వేలు స్థానం బిజెపికి దక్కింది. అక్కడినుంచి బొజ్జా రోశన్న పోటీచేశారు. ఆయన దాసరి సుధ చేతిలో ఓడిపోయారు. 18వేల మెజారిటీతో ఆమె గెలిచారు.
అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? ఆదినారాయణ రెడ్డి మాటలను బట్టి అలా ఊహిస్తున్న వాళ్లు.. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి సుధ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరుతారేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అసెంబ్లీకి వెళ్ల యోగ్యత కూడా లేకుండా.. కేవలం ఎమ్మెల్యేగా గెలిచి ఏమీ చేయలేకపోతున్నందుకు కినుకగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో దాసరి సుధ కూడా ఒకరు అని తెలుస్తోంది. ఆ పార్టీని వీడడానికి ఆమె సిద్ధంగా ఉన్నారని సమాచారం. బిజెపి అయితే.. మళ్లీ అదే సీటును దక్కించుకోవాలని, గెలిచి మళ్లీ అసెంబ్లీకి రావచ్చునని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బిజెపి- ప్రస్తుత పదవికి రాజీనామా చేయకుండా తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేయకపోవచ్చు. రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటాం అంటూ ఆదర్శలు చెబుతున్న బిజెపి వాటి ప్రకారమే వ్యవహరిస్తుంది. అందుకే సుధ రాజీనామా చేసి బిజెపిలో చేరుతారని, ఉప ఎన్నికలో మళ్లీ ఆమెకే టికెట్ ఇస్తారని కొన్ని ఊహలు నడుస్తున్నాయి.
ఆది మాటలతో అనేక అనుమానాలు, ఊహలు!
Friday, December 5, 2025
