ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగులేని ప్రజాబలంతో ప్రస్తుతం అధికారంలో ఉంది. రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా నడిపించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను అంతమొందించడం ఒక్కటే లక్ష్యంగా మూడు పార్టీలు జట్టుకట్టి అపూర్వ విజయం నమోదు చేశాయి. గెలిచిన తర్వాత కూడా ఈ మూడు కూటమి పార్టీల మధ్య అనన్యమైన ఐక్యత కనిపిస్తూనే ఉంది. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడని వ్యవహారం కూడా అదే. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ఈ మూడు పార్టీ సమైక్యంగా ఉండడం చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. కూటమి బంధంలో పుల్లలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. పవన్ కల్యాణ్ కు అవమానాలు జరుగుతున్నాయని, ఆయన జనసేన శ్రేణులు నీరసపడేలా చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని రకరకాల కువిమర్శలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పదవిని ఆశించి పొత్తుల వల్ల భంగపడిన కీలక నాయకులను మూడు పార్టీల్లోనూ రెచ్చగొట్టడానికి కూడా వైసీపీ దళాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే.. ఈ కూటమి పార్టీల మధ్య స్నేహబంధాన్ని వచ్చే ఎన్నికల వరకు అంటే.. మరో నాలుగైదేళ్లపాటు పదిలంగా కాపాడగలిగితే చాలు.. ఆ తర్వాత ఈ ఐక్యత ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలా మిగిలిపోతుందని అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన గురించి చాలా మంది ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్న నాయకుల్లో ఆశలున్నాయి. రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచి ఈ ఆశలున్నాయి. విభజన చట్టంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదన ఉంది. ఏపీలో 175గా ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య పునర్విభజన జరిగితే 225 అవుతుంది. అయితే ఎప్పుడు అవుతుంది? అనేదే సందేహం. 2029 ఎన్నికల్లోగా ఆ పర్వం పూర్తవుతుందని కొందరికి ఆశ. కానీ.. తాజాగా జనగణన కొత్తగా పూర్తిచేసిన తర్వాత గానీ.. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరగడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో.. 2034 కుమాత్రమే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. 2027లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంది. అది పూర్తయిన తర్వాత 2034 నాటికే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.
అయితే నియోజకవర్గాల్లో వివిధ కూటమి పార్టీలకు చెందిన నాయకుల మధ్య పొరపొచ్చాలు రాకుండా.. 2029 ఎన్నికలు జరిగితే చాలు.. ఆ తర్వాతి ఎన్నికలకు అందరికీ కొత్తగా 50 మందికి అవకాశాలు వస్తాయి. అప్పటికి ఇక అసంతృప్తులు కూడా మిగలవు. కొత్తగా వచ్చే సీట్లు.. మూడు పార్టీల్లోని కీలక ఆశావహులకు సర్దుబాటు అవుతాయి. అంటే ఏంటన్నమాట.. కూటమి పార్టీల మధ్య విభేదాలు రాకుండా అయిదేళ్లు గడిపితే చాలు.. ఆ తర్వాత వారి మైత్రి ఎప్పటికీ పదిలంగా ఉంటుందన్నమాట. కూటమి మైత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేరుగా మరణశాసనమే అవుతుంది కూడా.
కూటమిని అయిదేళ్లు కాపాడండి.. తర్వాత చెక్కుచెదరదు!
Sunday, December 7, 2025
