రాజకీయాల్లో ఒకరిని చూసి మరొకరు మాటలు నేర్చుకోవడం అనేది కొత్త కాదు, వింత కూడా కాదు. నాయకులు ఎప్పుడూ మరొకరిని కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కోణంలో చూసినప్పుడు.. కూటమి ప్రభుత్వంలోని నాయకులు, మంత్రులు.. సుమారు ఏడాది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలనే కాపీ కొడుతున్నారు. ‘వడ్డీతో సహా వసూలు చేస్తాం’ అనేదే ఆ మాట! వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ ఇదే మాటలు మాట్లాడుతుండడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నారా లోకేష్ కూడా అదే మాట అంటున్నారు. కాకపోతే.. ఇక్కడ అత్యంత కీలకంగా గమనించాల్సింది ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పగల గురించి, ప్రతీకారాలు తీర్చుకోవడం గురించి.. ‘వడ్డీతో సహా రాబడతాం..వసూలు చేస్తాం’ అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే సమయంలో నారా లోకేష్ మాత్రం.. ప్రగతి గురించి, అభివృద్ధి పనుల గురించి.. ‘వడ్డీతో సహా..’ అనే మాటలు వాడుతున్నారు.
నారా లోకేష్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల్లో సింగపూర్ గతంలో ఒక కీలక భాగస్వామిగా వ్యవహరించడానికి అంతా అంగీకరించిన సంగతి తెలిసిందే. సింగపూర్ కన్సార్షియం సారథ్యంలో అమరావతి రాజధానిలో స్టార్టప్ నగరం అభివృద్ధి చేయడానికి కూడా అప్పట్లో ఒప్పందాలు కుదిరాయి. ఆ విషయంలో వారు చాలా ముందుకెళ్లారు కూడా. అయితే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతి మీద కక్ష కట్టారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను స్మశానంగా మార్చాలనుకున్నారు. ఆ కృషిలో భాగంగా.. సింగపూర్ కన్సార్షియం వారిని కూడా నానా రకాలుగా అవమానించి, బెదిరించి.. వారు ఆ ప్రాజెక్టును వదులుకుని వెనక్కు వెళ్లిపోయే పరిస్థితి కల్పించారు. ఆ రకంగా రాష్ట్రానికి పెద్ద నష్టమే జరిగింది.
ఇటీవల కేబినెట్ భేటీలో కూడా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. స్టార్టప్ నగరం ప్రాజెక్టును తిరిగి చేపట్టడానికి సింగపూర్ ప్రభుత్వం సుముఖంగా లేదని వారి అసమ్మతిని ప్రస్తావించారు. అయితే.. తన సింగపూర్ పర్యటన ద్వారా.. ఏదో ఒకరూపంలో అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ ను భాగస్వామిని చేసేందుకు ప్రయత్నిస్తానని కూడా ఆయన హామీఇచ్చారు. అదే లక్ష్యంతో ప్రస్తుతం సింగపూర్ యాత్రలో ఉన్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు మంత్రులు నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్ కూడా ఉన్నారు.
సింగపూర్ లో తెలుగు డయాస్పోరాతో సమావేశం అయిన నారా లోకేష్.. గత అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ఏపీ అభివృద్ధి పరంగా ఎంతమేరకు నష్టపోయిందో.. అంతకు వడ్డీతో సహా కలిపి ఇప్పుడు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు. వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్య ఇదే వ్యత్యాసం అని ప్రజలు అనుకుంటున్నారు. వైసీపీ నేతలు వడ్డీతో సహా పగలు తీర్చుకుంటాం అని పదేపదే అంటోంటో.. కూటమి మంత్రులు వడ్డీతో సహా అభివృద్ధికి జరిగిన నష్టాన్ని పూడుస్తామని అనడం గొప్ప విషయంగా చెబుతున్నారు.
వడ్డీతో సహా..’: వాళ్లు పగల గురించి.. వీళ్లు ప్రగతి గురించి..
Friday, December 5, 2025
