జగన్ చేసిన గాయం బాబు టూర్ తో నయమవుతుందా?

Friday, December 5, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు తనకు ఒక్క చాన్స్ ఇచ్చిన తొలిరోజునుంచి విధ్వంసమే తన ఊపిరిగా పాలన సాగించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను పడకేయించడం, అమరావతి రాజధాని ప్రాజెక్టును సర్వనాశనం చేయడం ఆయన తొలి లక్ష్యాలు అయ్యాయి. దానికి తగ్గట్టుగానే ప్రతి విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన, సానుభూతిపరులైన పారిశ్రామికవేత్తలను వేధించడం ఒక ఎత్తు. రాజకీయ కక్ష అని అనుకోవచ్చు. కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా.. తెలుగుదేశం పాలన కాలంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా వెళ్లగొట్టడానికి ఆయన కుట్రలు చేశారు. తద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ముందుకు వచ్చిన సింగపూర్ కన్సార్షియం వారిని కూడా దాదాపుగా బెదిరించి, వాళ్లంతట వాళ్లే ఒప్పందాలను రద్దు చేసుకుని వెళ్లిపోయేలా చేయడం.. జగన్ దుర్మార్గాలకు పరాకాష్ట. అయితే.. అప్పట్లో రాష్ట్ర ప్రగతికి జగన్ చేసిన గాయాలకు ఇప్పుడు చంద్రబాబునాయుడు మందు రాస్తున్నారు. సింగపూర్ యాత్రతో ఆ గాయాలను నయం చేసే ప్రయత్నంలో ఉన్నారు.

వైసీపీ పాలనలో ఎదురైన వేధింపులకు జడుసుకుని.. సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికీ ఏపీ అంటేనే జడుసుకుంటున్నదని చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీలో వ్యాఖ్యానించారు. 2019కి పూర్వం రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందాలు  చేసుకుని.. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ కన్సార్షియం రంగం సిద్ధం చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. అయితే సింగపూర్ ప్రభుత్వం మీద బురద చల్లి వారిపట్ల దుర్మార్గంగా వ్యవహరించడంతో వారు వెనక్కు తగ్గారు. ఇప్పటికీ వారు ఆ ప్రాజెక్టును తిరిగి చేపట్టడానికి సుముఖంగా లేరని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

సింగపూర్ బయల్దేరి వెళ్లనున్న చంద్రబాబు ఈ పర్యటనలో అక్కడి ప్రభుత్వంతో సత్సంబంధాల్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేయబోతున్నట్టు వెల్లడించారు. స్టార్టప్ ఏరియా కాకపోయినా, ఏదో ఒక విధంగా అమరావతి అభివృద్ధిలో భాగం పంచుకునేలా సింగపూర్ ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఆయన చెప్పారు.

పైగా విశాఖలో ఈ నవంబరులో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు దుబాయి నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కూడా చంద్రబాబు సింగపూర్ యాత్రలో ఒక ఎజెండా అంశంగా ఉన్నదని తెలుస్తోంది. ఆయన పర్యటన ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగుతోంది. 26 నుంచి 31వ తేదీ వరకు ఆరురోజుల పాటు చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తారు. పలు దిగ్గజసంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలతో భేటీలు ప్లాన్ చేశారు. రాష్ట్రప్రభుత్వం పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సదుపాయాలు, రాయితీలు అన్నీ ఆయన వివరించి చెప్పనున్నారు. ఆసంస్థల ప్రతినిధుల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తారు.

తొలిరోజు సింగపూర్ సహా సమీపదేశాల్లోని ప్రవాసాంధ్రులు నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. పేదరిక నిర్మూలనకోసం ఉద్దేశించిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా ఆయాదేశాల్లోని ప్రవాసాంధ్ర సంపన్నులకు పిలుపు ఇస్తారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles