తాను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని గనుక.. తాను అక్రమాలకు పాల్పడి జైల్లో ఉంటున్నా సరే.. తనకు రాజభోగాలు ఉండాల్సిందేనని.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసి సాధించుకున్నారు. హైకోర్టు కూడా.. ఆయన కోరినవన్నీ ఇచ్చేయాలని సింపుల్ గా ఉత్తర్వులు ఇచ్చేసింది. కొత్త పరుపు, కొత్త దిండు, కొత్త మంచం, టీవీ, ఇంటి భోజనం, టేబులు కుర్చీ వంటివన్నీ మిథున్ రెడ్డి సాధించుకోగలిగారు గానీ.. ఒక్క విషయంలో మాత్రం ఆయన పప్పులుడికేలా కనిపించడం లేదు. జైల్లో ఉన్నాసరే తాను రాజభోగం అనుభవించాలి గనుక.. తనకు సపర్యలు చేయడానికి ఒక సేవకుడు ఉండాలని ఆయన కోరుకున్నారు. లోతుగా విచారణ జరిపి సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా.. కోర్టు కూడా ఆయన అడిగినవన్నీ ఇచ్చేయాలని చెప్పింది. తీరా ఇలాంటి ‘సహాయకుడు’ డిజిగ్నేషన్ తో సేవకుడును ఏర్పాటు చేయడానికి కుదరదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంటు హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు.
అసలు జైలు మాన్యువల్ లోనే.. ఖైదీలకు ‘సహాయకుడు’ అనే పదమే లేదని ఆయన తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జైలులో ఉన్న ఖైదీ ఎవరైనా తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి ఏ్పడితే, తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వస్తే.. అలాంటి సందర్భాల్లో జైలులో ఉండే ఆరోగ్య సిబ్బంది ని వారికి సహాయకులుగా నియమించేందుకు అవకాశం ఉన్నదని, అంతే తప్ప.. ఎంపీ మిథున్ రెడ్డి అడిగినట్టుగా సహాయకుడిని నియమించడం సాధ్యం కాదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
లిక్కర్ కేసులో కీలక నిందితుడిగా, మొత్తం పాలసీ రూపకల్పన దగ్గరినుంచి ముడుపుల సొమ్ము లబ్ధి పొందేవరకు పాత్ర ఉన్న మాస్టర్ మైండ్ గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి ఈ కేసులో ఆరోపణలున్నాయి. అరెస్టు కాకుండానే బెయిలు తెచ్చుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టిన తర్వాత.. చివరికి విచారణకు హాజరై అరస్టు అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎంపీగా ఆయనకు అదనపు సౌకర్యాలు కావాల్సి ఉన్నందున రాజమండ్రి జైలుకు పంపారు. అప్పటికీ.. తనకు అదనపు వసతులకోసం ఆయన పిటిషన్ వేసి సాధించుకున్నారు. అన్నీ సమకూర్చారు గానీ.. సహాయకుడి వద్దనే చిక్కు వచ్చింది. జైలు మాన్యువల్ లో అలాంటి ప్రొవిజన్ లేదని అధికారులు చెబుతున్నారు.
కాగా, మిథున్ రెడ్డి తరఫున ఆల్రెడీ బెయిలుకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. ఇప్పట్లో ఆయనకు బెయిలు లభించడం సాధ్యం కాదని న్యాయనిపుణులు అంటున్నారు. మిథున్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించడం జరగకుండా.. అసలు కేసు ఎలా ముందుకు వెళుతుందని సుప్రీం కోర్టు, ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేసిన సందర్భంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆయన కస్టోడియల్ విచారణ పూర్తికాకుండా బెయిలు రావడం అసాధ్యం అని పలువురు భావిస్తున్నారు.
మిథున్ గొంతెమ్మ కోరికలు తీర్చడం కుదర్దు’
Friday, December 5, 2025
