జగన్ దళాలు ఇప్పుడు ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. మాటలను వక్రీకరించడం, నాయకులు సుదీర్ఘంగా ఒక విషయం గురించి తమ అభిప్రాయాలను వెల్లడించినప్పుడు.. అందులో తమకు అనుకూలంగా ఉండే ఒక ముక్కను మాత్రం పట్టుకుని ఆ నాయకులు మీద బురద చల్లడానికి శక్తివంచనలేకుండా ప్రయత్నించడం వంటి కుటిలయత్నాలు వైఎస్సార్ కాంగ్రెస్ దళాలకు కొత్త కాదు. గతంలో చంద్రబాబునాయుడు అనేక విషయాలు మాట్లాడుతూ.. కొన్ని నిర్ణయాల వలన రాబోయే పరిస్థితుల గురించి పర్యవసానాల గురించి తన భయాన్ని వ్యక్తం చేస్తే ఆ వివరాలన్నీ పక్కకు నెట్టేసి.. కేవలం ఒకే ఒక్కమాటను పదేపదే ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్న, అధికారంలోకి వచ్చిన చరిత్ర జగన్ తండ్రికి ఉంది. ఇప్పుడు కూడా జగన్ దళాలు.. మంచి అచ్చెన్న మాటలను అదే రకంగా దుష్ప్రచారం చేయడం ద్వారా లాభం పొందాలని కుట్రప్రయత్నాలు చేస్తున్నాయి.
‘ఆడబిడ్డ నిధి’ అనేది చంద్రబాబునాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక మంచి హామీ. సూపర్ సిక్స్ హామీలలో అది కూడా ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండి59 ఏళ్ల వరకు వయసున్న ప్రతి మహిళకు తాను నెలకు 1500 రూపాయలు ఇస్తానని.. నెలకు 15వేలు సంపాదించే మార్గాలను వారికి చూపిస్తానని ఆయన ఎన్నికల సమయంలో చాలా ఘనంగానే చెప్పారు. ఆ హామీ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు, మడమ తిప్పడం కూడా లేదు. త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమల్లోకి వస్తుందని ఇటీవల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నంద్యాలలో తొలిఅడుగు కార్యక్రమంలో ప్రకటించారు కూడా.
ప్రభుత్వం తమ హామీల విషయంలో ఒక్కటొక్కటిగా కార్యరూపంలో పెడుతూ ముందుకు సాగుతున్నది. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం వద్ద నిర్దిష్ట కార్యచరణ ప్రణాళిక ఉన్నది. ఈ బడ్జెట్ లో దానికోసం నిధులు కేటాయించారు కూడా. ఈ పరిస్థితుల్లో మంత్రి అచ్చెన్నాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్వరలోనే ఆడబిడ్డ నిధి పథకం అమల్లోకి వస్తుందని ధ్రువీకరిస్తూనే ఈ పథకం వల్ల పడగల భారాన్ని ప్రస్తావించారు. ఈ పథకం అమలు చేయడానికి రాష్ట్రాన్ని అమ్మవలసినంత నిధులు అవసరమౌతాయని, అయినా సరే ఆర్థిక భారానికి వెరవకుండా ప్రభుత్వం దీనిని అమలు చేయబోతున్నదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మాటల ద్వారా.. ఆయన కేవలం ఆడబిడ్డ నిధి పథకంతో పడగల ఆర్థికభారం యొక్క తీవ్రతను సూచించదలచుకున్నారు తప్ప.. పథకం అమలు చేయబోం అనే మాట ఎక్కడా అనలేదు. ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం దీని అమలు కోసం చేస్తున్న కసరత్తును మాత్రమే ఆయన ప్రస్తావించదలచుకున్నారు.
అయితే ఈ మాటలను మసిపూసి మారేడు కాయ చేసి బురద ప్రచారం చేయడానికి జగన్ తాలూకు నీలిదళాలు ఎగబడుతున్నాయి. ఆడబిడ్డ నిధికోసం రాష్ట్రాన్ని అమ్మేయాలని అచ్చెన్న అంటున్నారని, ఆ పథకం ఎఫ్పుడు అమలు చేస్తారో సీఎం చెప్పాలని నానా కారుకూతలు కూస్తున్నారు. అయితే జగన్ దళాల పసలేని విమర్శలకు ఏమాత్రం స్పందించకుండా, రెచ్చిపోకుండా.. ప్రతి హామీని కూడా తాను అనుకున్న షెడ్యూలు ప్రకారం నింపాదిగా చేసుకుపోతున్న చంద్రబాబునాయుడు.. ఈ విషయంలో కూడా అలాగే స్పందిస్తారని ప్రజలు అనుకుంటున్నారు.
అచ్చెన్న మాటల వక్రీకరణతో నీలిదళాల్లో ఆనందం!
Friday, December 5, 2025
