ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సుప్రయాణం అవకాశం కల్పిస్తామని.. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పలుసందర్భాల్లో చాటి చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం అనే హామీ ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సహా, వేర్వేరు ప్రాంతాల్లో ఏరకంగా అమలవుతున్నదో ఏపీ అధికారులు, నాయకుల బృందాలతో క్షుణ్నంగా అధ్యయనం చేయించారు. వారి నివేదికలు అన్నింటినీ పరిశీలించిన పిమ్మట.. ఏ ఇతర రాష్ట్రంలోనూ లేనంత చక్కగా ఏపీలో ఉచిత ప్రయాణం అమలు చేస్తామని కూడా చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వేస్తున్న అడుగులు గమనిస్తోంటే.. చంద్రబాబు హామీ నిజమే అనే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది.
ఏపీ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీని సిద్ధం చేసే క్రమంలో జరుగుతున్న సన్నాహాలను వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం అవసరమైన 1400 బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయబోతున్నట్టుగా వెల్లడించారు. అలాగే సుమారు రెండువేల ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొనుగోలు చేసి ఆర్టీసికి పూర్వ వైభవం తీసుకువస్తామని అంటున్నారు. అంటే దాదాపు ఏపీఆర్టీసికి మూడున్నర వేల బస్సుల వరకు కొత్తగా సమకూరనున్నట్టుగా తెలుస్తోంది. ఉచిత బస్సుప్రయాణం అమలు కాబోతున్న నేపథ్యంలో ఇది చాలా గొప్ప పరిణామం అని ప్రజలు అనుకుంటున్నారు.
ఎందుకంటే- ఇటు తెలంగాణలో గానీ, పొరుగున ఉన్న కర్ణాటక లో గానీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినప్పుడు నానా రచ్చలూ అయ్యాయి. మహిళలు అప్పటిదాకా జీవితంలో ఎన్నడూ బస్సు ఎక్కని వారికి ఒకేసారి ఉచిత అవకాశం దక్కినట్టుగా ఎగబడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం అనేది రెండు మూడురోజుల తర్వాత ఎత్తేస్తారేమో అని భయపడుతున్నట్టుగా.. వెంపర్లాడారు. గుంపులుగుంపులుగా బస్సుల మీదికి ఎగబడ్డారు. దాదాపుగా దాడులు జరిగాయి. మహిళల మధ్య కొట్లాటలు జరిగాయి. సిగపట్ల చోటు చేసుకున్నాయి. సూటిగా చెప్పాలంటే.. చాలా బస్సుస్టాండువల వద్ద మహిళరద్దీని, గొడవలను నియంత్రించడానికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆయా ప్రభుత్వాలు అనూహ్యం కానటువంటి ఈ రద్దీని పరిహరించడానికి గానీ, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
కానీ ఏపీలోని చంద్రబాబునాయుడు సర్కారు అలాంటి పొరబాటు పని చేయడంలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అవకాశం కల్పించడం వలన అనివార్యంగా పెరిగే రద్దీ వలన ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి దాదాపుగా మూడున్నర వేల బస్సులు కొత్తగా సమకూర్చుకోవడానికి ప్లాన్ చేస్తోంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాటల ప్రకారం తొలిదశలో 1400 బస్సులు అందుబాటులోకి వస్తాయి. అలాగే.. తర్వాతి దశలో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
ఏ రాష్ట్రమూ చూపనంత శ్రద్ధగా ‘ఉచిత బస్సుప్రయాణం’!
Friday, December 5, 2025
