పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన “హరి హర వీర మల్లు” సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపును ఆమోదించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి ప్రత్యేక టికెట్ ధరల జారీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలంగాణలో విడుదలపై తొలుత కొన్ని సందిగ్ధతలు ఉన్నా, చివరికి అన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సినిమాను విడుదల చేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా జూలై 23 రాత్రి 9 గంటల తర్వాత ప్రత్యేక ప్రీమియర్ షోల నిర్వహణకు అవకాశం కల్పించింది. ఈ ప్రీమియర్ షో టికెట్ల ధర సుమారుగా రూ. 708 (రూ.600+ GST)గా ఉండనుంది.
జూలై 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ. 200 + జీఎస్టీగా ఉండగా, సింగిల్ స్క్రీన్‌లకు రూ. 150 + జీఎస్టీగా నిర్ణయించారు. అంటే ఆ రోజులలో మల్టీప్లెక్స్ టికెట్ ధర సుమారుగా రూ. 531, సింగిల్ స్క్రీన్ టికెట్ రూ. 354 వరకు వెళ్లే అవకాశం ఉంది.
తర్వాత జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకూ మళ్లీ టికెట్ రేట్లు కాస్త తగ్గుతాయి. మల్టీప్లెక్స్ టికెట్ రూ. 150 + జీఎస్టీ కాగా, సింగిల్ స్క్రీన్ టికెట్ రూ. 106 + జీఎస్టీగా ఉంటుంది. ఈ సమయంలో మల్టీప్లెక్స్ టికెట్ సుమారుగా రూ. 472, సింగిల్ స్క్రీన్ టికెట్ రూ. 302గా ఉండొచ్చు. పైగా ఈ రోజులలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చారు.
ఇన్ని సౌకర్యాలు లభించడంతో ఈ సినిమా మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నైజాంలో కూడా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి బుకింగ్‌లు ఓపెన్ అయ్యే విధంగా నిర్మాతలు ప్రకటించారు.
జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించగా, ప్రతినాయక పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. విడుదలకు సర్వం సిద్ధంగా ఉండడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.
