ఆయనపై ప్రేమ దాచుకోకుంటే జనం ఛీకొడతారు జగన్!

Friday, December 5, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసే ప్రేమాభిమానాలు కూడా చాలా కృతకంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ ప్రహసనాన్ని ఎన్నికల సమయంలో చూసితీరాల్సిందే. ఆయన ఒక్కొక్క చోట సభ పెట్టి.. ఆ ప్రాంతంలో పోటీచేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ వేదిక మీదికి పిలిచి.. ఒక్కొక్కరి భుజం మీద చేయి వేసి.. ‘అన్న మంచివాడు, సౌమ్యుడు’ అంటే రెండే పదాల స్క్రిప్టును ప్రతి ఒక్కరి విషయంలోనూ వల్లెవేస్తూ కీర్తించడాల్ని జనం చూశారు. అలాంటి సందర్భాల్లో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని చూపించి.. సౌమ్యుడు అనే పదం అనగానే.. జనం గొల్లున నవ్విన సందర్భాలున్నాయి. అదంతా పక్కన పెడితే.. ఇలాంటి కృతకమైన ప్రేమలను వ్యక్తం చేయడాన్ని జగన్ కొంచెం దాచుకోవాలని లేకపోతే.. ఆయనకే పరువునష్టం అని ప్రస్తుతం ప్రజలు అంటున్నారు.

దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు దాటిపోయిన లిక్కర్ స్కామ్ లో  ఇప్పటికి మొత్తం 40 మంది నిందితులుగా లెక్కతేలారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం రిమాండులో జైల్లోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు బెయిలు కావాలంటూ దరఖాస్తు చేసుకుంటున్నారు గానీ.. కోర్టులు తిరస్కరిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి తన పేషీలో ఓఎస్డీగా పనిచేసిన ధనంజయరెడ్డి మీద అవ్యాజమైన ప్రేమానురాగాలు పుట్టుకొచ్చాయి. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అధికారులను కూటమి ప్రభుత్వం వేధిస్తున్నదంటూ జగన్ సన్నాయినొక్కులు నొక్కారు. ఆ క్రమంలోనే.. ధనంజయరెడ్డి  లాంటి మచ్చలేని మంచి అధికారుల్ని కూడా వేధిస్తున్నారని, ఇది తగదని వెనకేసుకు వచ్చారు. జగన్ ఎతో యథాలాపంగా అధికారులను వేధిస్తున్నారని అనేసి ఊరుకుంటే ఆయనకే పరువుగా ఉండేది. కానీ ప్రత్యేకంగా ధనంజయరెడ్డి పేరు ప్రస్తావించి.. ఆయన మంచితనం, మచ్చలేనితనం గురించి చెప్పడం జగన్ ను నవ్వులపాలు చేస్తోంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ధనంజయరెడ్డి డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా అధికారాలు చెలాయించాడనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటిదాకా పార్టీనుంచి బయటకు వెళ్లిపోయిన ప్రతి నాయకుడు కూడా.. ధనంజయరెడ్డి మీద ఆరోపణలు చేసే వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డికి, పార్టీ నాయకులకు మధ్య అడ్డుగోడలాగా ధనంజయరెడ్డి ఉండిపోయి దందాలు చేశారని అనేక ఆరోపణలు వచ్చాయి. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు జగన్ చుట్టూ కోటరీ అంటూ ప్రస్తావించిన వాటిలో కూడా ధనంజయరెడ్డి పేరుంది. జగన్ తాను సీఎంగా ఉండగా.. మంత్రులు తన వద్దకు ఆబ్లిగేషన్లతో వస్తే కూడా ధనంజయ్ అన్నవద్దకు వెళ్లమని చెప్పేవారని, వాళ్లంతా దానిని చాలా అవమానంగా భావించేవారని పార్టీ వర్గాలే అంటుంటాయి.

ఇలాంటి నేపథ్యంలో ప్రజలందరిలో కూడా ధనంజయరెడ్డి అంటేనే జగన్ తరఫు దందాలు నడిపించే కీలక ఐఏఎస్ అధికారిగా గుర్తింపు ఉంది. అలాంటి అవినీతిపరుడైన అధికారిని బహిరంగంగా వెనకేసుకువస్తూ మాట్లాడితే జగన్ పరువే బజారుపాలవుతుందని పలువురు అంటున్నారు. ధనంజయ్ అన్న మీద జగన్ కు ప్రేమ ఉంటే.. దాన్ని ఆయన ఎంతగా దాచుకుంటే అంత పరువుగా రాజకీయం చేయగలరని కూడా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles