వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని, తెదేపా తరఫున గెలిచినా కూడా ఆయన పంచన చేరి చెలరేగిపోయిన నాయకుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. నీచమైన వ్యాఖ్యలతో భ్రష్టుపట్టిపోయిన వంశీ.. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అనుచరులతో దాడిచేయించడం దగ్గరినుంచి, కిడ్నాప్ నిర్బంధాలు, భూకబ్జాలు, నకిలీపట్టాలు, అక్రమమైనింగ్ వంటి అనేక కేసుల్లో ఆయన ఇరుక్కున్నారు. రిమాండులో జైలు పాలు కూడా అయ్యారు. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిళ్లు, ముందస్తు బెయిళ్లు లభించాయి. మొత్తానికి కొన్ని వారాలకిందట ఆయన జైలునుంచి బెయిలుపై విడుదల అయ్యారు. కానీ.. వంశీకి ఈ ఆనందం కలకాలం నిలిచేలా కనిపించడం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. పోలీసులు తలచుకుంటే వల్లభనేని వంశీని తక్షణమే అరెస్టు చేసే అవకాశం ఉన్నదని అనిపిస్తోంది. వంశీకి అక్రమమైనింగ్ కేసులో హైకోర్టు మే 29న ఇచ్చిన ముందస్తు బెయిలును కొట్టివేస్తూ, మళ్లీ విచారణ జరపాలని ఉత్తర్వులు ఇచ్చిన సుప్రీం కోర్టు.. అప్పటిదాకా వంశీని అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించడానికి కూడా నిరాకరించడమే ఇందుకు కారణం!
వంశీకి ఇతర కేసుల్లో బెయిలు లభించినట్టే అక్రమమైనింగ్ కు సంబంధించిన కేసులో కూడా బెయిలు వచ్చింది. అయితే, ఈ కేసులో ప్రభుత్వం తరఫు వాదనలు వినకుండానే.. హైకోర్టు ముందస్తు బెయిలు ఇచ్చేసిందంటూ.. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంలో వాదించారు. సుప్రీం న్యాయమూర్తి ఈ వాదనలతో ఏకీభవిస్తూ.. రాష్ట్రప్రభుత్వం కౌంటర్ కు సమయం అడిగినట్లు హైకోర్టు ఉత్తర్వుల్లోస్పష్టంగా ఉండగా.. ఆ అవకాశం ఇవ్వకుండానే ముందస్తు బెయిలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇలాటి విచారణ గతంలో ఎక్కడా చూడలేదని కూడా వ్యాఖ్యానించడం విశేషం. ఈ కేసును మళ్లీ పూర్తిగా విచారించి.. రాష్ట్ర ప్రభుత్వం వేసే కౌంటరునుకూడా పరిశీలించి ఆ తర్వాత బెయిలుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. వారంలోగా ప్రభుత్వం కౌంటర్ వేయాలని, వీలైనంత త్వరగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఈ సుప్రీం తీర్పు వల్లభనేని వంశీకి అత్యంత చేదు తీర్పు అని చెప్పాలి. ఎందుకంటే.. ఆయన తరఫు న్యాయవదులు సుప్రీంలో కనీసం ఆయనకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తమ క్లయింటు జైల్లో ఉన్నప్పుడు పీటీవారంటు అమలుపై స్టే ఇచ్చారని ఇప్పుడు ఆయన బెయిలుపై బయటకు వచ్చినందున పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉన్నదని భయాన్ని వ్యక్తం చేశారు. అందుకే అరెస్టునుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు కావాలని అడిగారు. ఇందుకు కూడా సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అరెస్టునుంచి రక్షణ కల్పించే మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదని తేల్చింది. దీంతో అక్రమమైనింగ్ కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలా వద్దా అని హైకోర్టు మళ్లీ విచారణ ప్రారంభించి తుది తీర్పు వెలువరించే వరకు పోలీసులు ఆగవలసిన అవసరం లేకుండాపోయింది. వారు తలచుకుంటే ఈ కేసులో వంశీని ఏ క్షణమైనా అరెస్టు చేయడానికి అవకాశం ఉన్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పోలీసులు తలచుకుంటే వంశీ తక్షణ అరెస్టు!
Friday, December 5, 2025
