జగన్ బాటలో నడిస్తే.. కేతిరెడ్డి ఇల్లు కూల్చాల్సిందే!

Friday, December 5, 2025

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు మీడియా మైకు కనిపిస్తే చాలు ఒకే రకమైన మాటలతో రెచ్చిపోతూ ఉంటారు. కూటమి ప్రభుత్వం తమ పార్టీ నాయకులను విచ్చలవిడిగా వేధిస్తున్నదని.. జగన్ 2.0 ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ వేధింపులకు వడ్డీ కూడా కలిపి తెలుగుదేశం వారికి, కూటమి పార్టీల నాయకులకు రుచి చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి పదే పదే అంటూ ఉంటారు. అయితే ఇప్పటి పరిణామాలను గమనిస్తూ ఉంటే గత ఐదేళ్ల పదవీకాలంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వారి పట్ల పాల్పడిన దురాగతాలకు కనీసం సమానంగా తిరిగి చెల్లించడం మీద కూడా ఇప్పటి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు అని అర్థమవుతుంది.

ఎందుకంటే వారు ఆ రకంగా ప్రతిస్పందించడం  ప్రారంభిస్తే కనుక.. ముందుగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేయడం జరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి సర్కారు కేవలం చేపడుతున్న అభివృద్ధి పనుల మీద మాత్రం దృష్టి పెడుతూ ముందుకు సాగుతోంది అని అర్థమవుతుంది. వారే గనుక జగన్ అప్పట్లో చేసిన పనులే చేయాలనుకుంటే.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూల్చేవాళ్లే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తాడిపత్రి రాజకీయాలు రాష్ట్రంలోనే హాట్ హాట్ గా నడుస్తూ ఉంటాయి.

ఇక్కడ జెసి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలను టాప్ గేర్ లోకి తీసుకువెళుతూ ఉంటారు. జగన్ జమానా సాగుతున్న రోజుల్లో తాడిపత్రిలో అడుగుపెట్టడానికి కూడా వీల్లేకుండా ఆ ప్రభుత్వం కట్టడి చేయడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం హైదరాబాదులోనే గడుపుతూ వచ్చిన సంగతి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేతిరెడ్డిని మాత్రం తాడిపత్రిలో అడుగుపెట్టనిచ్చేది లేదని ఆయన పట్టుపడుతున్నారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాలు కక్షల స్థాయికి చేరుకుని రగులుతున్నాయి.

జేసీ గురించి జగన్ కూడా ప్రస్తావిస్తూ తమ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని సొంత ఇంటికి కూడా వెళ్లనివ్వరా అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక కొత్త సంగతి కూడా బయటపెట్టారు. అసలు కేతిరెడ్డికి తాడిపత్రిలో సొంత ఇల్లు ఉందా? అని ఆయన అడుగుతున్నారు. కేతిరెడ్డి ఇల్లు.. అక్కడి మునిసిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న ఇల్లు అని ఆయన సెలవిస్తున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్న ప్రకారం.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు మునిసిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టుకున్నదే అయితే గనుక.. ఆ ఇంటిని ఇంతవరకూ కూల్చివేయకుండా ఉపేక్షించడం చంద్రబాబు సర్కారు మంచితనానికి నిదర్శనం కిందనే లెక్క.

ఎందుకంటే.. జగన్ తన పాలన కాలంలో.. తెలుగుదేశం నాయకుల ఇళ్లు చిన్నచిన్న ఉల్లంఘనలకు పాల్పడి ఉన్నా కూడా వాటిని అంతకంటె ఎక్కువ భాగం మేరకు నష్టం జరిగేలాగా నిర్దాక్షిణ్యంగా అప్పట్లో కూల్చివేయించారు. కోర్టుల ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా కూల్చివేతలు సాగించడమూ జరిగింది. జగన్ తన ఇంటిని కూల్చివేయడానికి జేసీబీలను పంపినప్పుడు.. ఒకప్పట్లో ఆయనకు ఎంతో ఆప్తుడిగా ఉండి, ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిన విశాఖపట్నం నాయకుడు సబ్బం హరి.. చాలా పోరాడారు. ఆ వేదనలోనే ఆయన మరణించారు కూడా. జగన్ సర్కారు పాల్పడిన కూల్చివేతలకు బదులు తీర్చుకునేట్లయితే.. ముందు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూలుతుందని, కానీ కూటమి సర్కారు చాలా సంయమనం పాటిస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles