తుగ్లక్ పరిపాలన అంటే ప్రజల ఊహకు కూడా అందని రకరకాల పిచ్చి పన్నులను వడ్డించి, ప్రజల నడ్డివిరిచి వారిని దోచుకుని ఖజానాను నింపుకోవడం మాత్రమే అని ఒక నిర్వచనం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్లపాటు విధ్వంసానికి చిరునామాలాగా జరిగిన వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా కొన్ని అంశాలలో తుగ్లక్ పోకడలను మించిపోయింది. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ టాక్స్ పేరుతో రవాణా వాహనాలకు విధించే వార్షిక పన్నును అనూహ్యంగా బీభత్సంగా పెంచేశారు. 12 సంవత్సరాలు దాటిన లారీలకు ఈ గ్రీన్ టాక్స్ బాదుడు వర్తిస్తుంది అని ప్రకటించారు. ఒక లారీ ద్వారా వారు ఏడాదికి సంపాదించే మొత్తంలో ఇంచుమించుగా ఒక వాటా దోచుకోవడమే లక్ష్యం అన్నట్లుగా ప్రభుత్వం పన్నులు వాయించేసరికి లారీల పరిశ్రమ గగ్గోలు పెట్టింది.
సహజంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి మొరలను ఆలకించలేదు. కానీ ఎన్నికల ప్రచార సమయంలో తనను కలిసిన లారీ యజమానులకు భరోసా ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ విధించిన గ్రీన్ టాక్స్ దందాల పన్నును భారీగా తగ్గించి వారికి మహా ఉపశమనం కల్పించారు. ఊరట అందించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలన కాలంలో సంక్షేమ పథకాల రూపంలో ప్రజల ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాను అని చాటుకుంటూ మరొక చేత్తో వారి జేబులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారనేది జగమెరిగిన సత్యం. ఒకవైపు పేద కుటుంబాలకు సాయం అందిస్తూ, మద్యం ధరలను అమాంతం రెట్టింపు కంటే ఎక్కువ పెంచేసి వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను గుల్ల చేసిన సేవాతత్పరత జగన్మోహన్ రెడ్డిది. అలాంటి జగన్ రవాణా వాహనాలపై అనగా లారీల పరిశ్రమపై కూడా కక్ష కట్టినట్టుగా వ్యవహరించారు.
12 సంవత్సరాల కాల పరిమితి దాటిన లారీలకు వార్షికంగా చెల్లించవలసిన పన్నులను అత్యంత భారీగా పెంచేశారు. పది టన్నుల లారీకి రూ.5000 కాగా, 30 టన్నుల లారీకి రూ.15 వేల వరకు ఈ భారం పెరిగింది. దీంతో లారీల పరిశ్రమ మొత్తం అట్టుడికిపోయింది. వాళ్లు రకరకాలుగా వేడుకున్నప్పటికీ జగన్ కరగలేదు. లారీల యజమానుల సంఘం వారు ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు ను కలిసి తమ మొర వినిపించారు. గ్రీన్ టాక్స్ తగ్గిస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లారీ సంఘాల ప్రతినిధులు సీఎంను కలిసి తమ విజ్ఞప్తిని గుర్తు చేశారు.
