‘రప్పా రప్పా’పై వండబడుతున్న అనేక స్క్రిప్టులు!

Wednesday, December 10, 2025
రాష్ట్ర ప్రజలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖులుగా భావిస్తుంటారేమో మనకు తెలియదు. కానీ రాష్ట్రంలో ప్రజలంటే.. వారికి ఒక సొంత ఆలోచన ఉంటుందని, సొంత బుద్ధి, సొంత విచక్షణ ఉంటాయని ఆయన నమ్మడం లేదు- అని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మనకు అర్థమవుతుంది. ప్రజలు అనేవాళ్ళు తాను ఏం చెబితే అది నమ్ముతారని, తాను ఎలా కావాలనుకుంటే అలాగ ప్రజల ఆలోచనలను దారి మళ్ళించవచ్చునని.. ఒక రకమైన దురహంకారంతో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నట్లుగా కూడా మనకు అనిపిస్తుంది.

ఎందుకంటే జగన్ 2.0 ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులను ‘‘గంగమ్మ జాతరలో వేట పోతును నరికినట్టుగా రప్పా రప్పా నరుకుతాం’ అనే మాటలు ప్రజల దృష్టిలో పార్టీని చాలా చులకన చేశాయని జగన్ కు అర్థమైంది. అయితే తాము ఆ వ్యాఖ్యలను సమర్ధించుకోవడం ద్వారా ప్రజలలో కలిగిన ఆగ్రహాన్ని, పుట్టిన భయాన్ని దారి మళ్ళించవచ్చు.. అనే భ్రమల్లో వారు తప్పు మీద తప్పు చేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు విలేకరుల సమావేశాలు నిర్వహించి.. అనేక అంశాల మీద ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.  అయితే ప్రతి విలేకరుల సమావేశంలో కూడా ‘రప్పా రప్పా’ అనే దుర్మార్గమైన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం మాత్రం వారు మరచి పోవడం లేదు.

ఎందుకంటే వారి ప్రధాన అజెండా ఆ వ్యాఖ్యలే! ‘రప్పా రప్పా’ అనే వ్యాఖ్యల చుట్టూ ప్రతిరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో అనేకానేక స్క్రిప్టులు వండబడి.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కీలక నాయకులకు చేరుతున్నాయి. వాటిని ఎదుట పెట్టుకొని వారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ.. ఆ మాటలో తప్పేముంది అని తమ తమ సొంత వక్ర భాష్యాలను జోడిస్తూ రెచ్చిపోతున్నారు. మనం సమకాలీన పరిణామాలను గమనిస్తే ప్రతి వైసిపి నాయకుడు కూడా రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగు సినిమా డైలాగే కదా.. ఒకవేళ ఆ డైలాగు తప్పు అనేట్లయితే దానిని సెన్సార్ వాళ్లే నిషేధించి ఉండాలి కదా.. అంతకంటే ఘోరమైన అనేక డైలాగులు బాలయ్య, పవన్ కళ్యాణ్ సినిమాలలో కూడా ఉంటాయి కదా అని రకరకాల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఇలా చెప్పడం వలన ‘రప్పా రప్పా’ నరుకుతాం అనే డైలాగులో ఎలాంటి తప్పు లేదని.. ఏదో సరదాగా సినిమా డైలాగులు వల్లించారే తప్ప అందుకోసం వైసిపి వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని ప్రజలు మెత్తబడతారనేది వారి భ్రమ,  అపోహ! జగన్మోహన్ రెడ్డి ఒకదఫా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి అయ్యుండి కూడా ఇలాంటి తప్పుడు వాదనను తెరపైకి తీసుకువచ్చారు. అంతే పార్టీ నాయకులందరూ కూడా ఇదే స్టాండ్ తీసుకున్నారు. అది కేవలం సినిమా డైలాగు కదా అని మాట్లాడడం.. దాని ముందు వెనుక సమర్ధించుకునేలాగా మరికొన్ని అంశాలు జోడించడం స్క్రిప్టులు తయారు కావడం ఫ్యాషన్ అయిపోయింది.

అసలు కూటమి ప్రభుత్వానికి సినిమా అంటే గౌరవం లేదని, అందుకే సినిమా డైలాగు వాడినందుకు కూడా కేసులు పెడుతున్నారని వంకరగా మాట్లాడుతున్నారు. సినిమా పరిశ్రమ అనేది చాలా గొప్పదని సినిమా కనుక లేకపోతే తెలుగుదేశం పార్టీనే పుట్టేది కాదని తమకు తోచిన రీతిగా అన్వయాలు చెబుతున్నారు. సినిమా అంటే ‘రప్పా రప్పా’ నరుకుతాం అనే హింసాత్మక, విధ్వంసక రెచ్చగొట్టే డైలాగు మాత్రమే అనే నిర్వచనం ఉన్నట్లుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మాటలు వుంటున్నాయి. ఇలాంటి మాటలు వలన వాళ్ళు ప్రజలను మూర్ఖులుగా పరిగణించడం మాత్రమే కాదు, సినిమా పరిశ్రమను కూడా అవమానిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

వారు ఎన్ని రకాల వంకర గోబెల్స్ ప్రచారాలు చేసినాసరే ప్రజలు మాత్రం ఆ మాటల్లోని వాళ్ళ విధ్వంసక, హింసాత్మక బుద్ధులను గమనించారనేది సత్యం. జగన్ 2.0 సర్కారు ఏర్పడితే కచ్చితంగా నరకడాలే ఉంటాయని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదుకదా..  ప్రజలే భయపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం శాంతిభద్రతల పరిస్థితులు అన్నీ సర్వనాశనం అవుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నాయకులు పదేపదే ఆ మాటల గురించి మాట్లాడుతూ తమ నెత్తిన తామే చెత్త వేసుకుంటున్నట్లుగా పరిస్థితి తయారవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles