విశాఖపై జగన్ లో దింపుడుకళ్లెం ఆశలు!

Friday, December 5, 2025

అక్కడ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. సాధారణంగా.. శవాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లి పూడ్చిపెట్టడమో, దహనం చేయడమో జరగడానికి ముందు చెవిలో పేరు పెట్టి పిలుస్తారు. ఏ మూలనైనా ప్రాణం దాగిఉంటే లేచి వస్తారని ఆశ అన్నమాట! దానినే దింపుడుకళ్లెం ఆశల అంటారు. కానీ.. ఆ పార్టీ అక్కడ సమాధి కూడా అయిపోయింది. కానీ.. జగన్మోహన్ రెడ్డిలో మాత్రం ఇంకా దింపుడు కళ్లెం ఆశలు కొనసాగుతూనే ఉన్నాయని పలువురు నవ్వుకుంటున్నారు. ఇదంతా విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం.

విశాఖపట్టణం కార్పొరేషన్ ను వైసీపీ ఆల్రెడీ కోల్పోయింది. జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలను అడ్డగోలుగా నిర్వహించారు. విచ్చలవిడి అరాచకాలకు పాల్పడడం ద్వారా.. ఈ కార్పొరేషన్ ను దక్కించుకున్నారు. అప్పటికి ఆ కార్పొరేషన్ పరిధిలో వారికి ఎమ్మెల్యేలు లేకపోయినాకూడా తెలుగుదేశం తరఫున గెలిచిన వారిని తమలో కలుపుకున్నారు. కొర్పొరేషన్ గెలిచిన తర్వాత.. ఇక బలం పెరుగుతుందని అనుకున్నారు. మూడు రాజధానులు పేరు చెప్పి.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అనడం వల్ల ఆ ప్రాంత ప్రజలు తనను నెత్తిన పెట్టుకుంటారని జగన్ భ్రమపడ్డారు. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి ఆ జిల్లాలో సున్న సీట్లు దక్కాయి. ఘోరమైన పరాభవం అది. జగన్ మోహన్ రెడ్డి వంచనకు ప్రజలు పడలేదు. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కూడా లేదని, ఆ పార్టీని నమ్ముకుంటే అథోగతేనని అందరికీ అర్థమైంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ లోని 27 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లోకి ఫిరాయించారు.

వీరిని బతిమాలి బెదిరించి.. నానా రకాల దురాగతాలకు పాల్పడి మొత్తానికి కార్పొరేషన్ నిలబెట్టుకోవాలని అనుకున్నది గానీ.. వైసీపీ పప్పులుడకలేదు. అటు మేయర్, డిప్యూటీ మేయర్ రెండుస్థానాలను కూడా కోల్పోయింది. ఆ రకంగా విశాఖ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడం కూడా పూర్తయింది. అంతా అయిపోయిన తర్వాత.. ఇప్పుడు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలతో అడుగులు ముందుకు వేస్తోంది.
ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో.. వారి ఉత్తర్వుల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఫిరాయించిన కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ ల మీద అవిశ్వాసం పెట్టినప్పుడు వైసీపీ ఇచ్చిన విప్ నకు వ్యతిరేకంగా కార్పొరేటర్లు ఓట్లు వేశారని పార్టీ ఫిర్యాదు చేసింది. ఈసీ ఉత్తర్వులు రావడంతో.. కలెక్టరు షోకాజు నోటీసులు పంపారు. వారంలోగా వివరణ ఇవ్వాలని లేకుంటే తదుపరి చర్యలుంటాయని కలెక్టరు అందులో పేర్కొన్నారు.

అయితే ఇలాంటి ప్రయత్నం వల్ల ఒరిగేది ఏమీ లేదని వైసీపీకి కూడా తెలుసు. ఇప్పుడు షోకాజుల వల్ల పదవులు పోవు అని- వారి వివరణలు మరియు విచారణల పర్వం మొత్తం పూర్తయ్యేసరికి ఏడాదికి పైగా గడచిపోతుందని అప్పటికి మళ్లీ ఎన్నికలు కూడా వచ్చేస్తాయని ప్రజలు అంటున్నారు. అందుకే వైసీపీ చేస్తున్న దింపుడు కళ్లెం ఆశల ప్రయత్నం.. దండగ అని వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles