విజయవాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ హారిక మరియు ఆమె భర్త ప్రయాణిస్తున్న కారును తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకుని నిలదీయడం దూషించడం జరిగింది. ఈ ఉదంతాన్ని వాడుకుని జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయనలో వచ్చిన ఒక గొప్ప మార్పు ఏంటంటే.. ఆయన ప్రతి పదానికి టేబుల్ మీద ఉన్న కాగితం చూసుకుంటూ.. ఒక్కొక్క పదమూ పలుకుతూ ప్రెస్ మీట్ పెట్టడం కాకుండా.. నాలుగైదు పదాలు మాట్లాడిన తర్వాత పేపరు చూసుకుంటూ మాట్లాడారు. అయితే తమ పార్టీ జడ్పీ ఛైర్మన్ ను తెలుగుదేశం వారు నిలదీశారు గనుక.. ఆయన అడ్డగోలుగా దానిని సమర్థించుకుంటూ మాట్లాడడం గురించి ప్రత్యేంకగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన అంశాలను గమనిస్తే.. పోలీసుల మీద ఆయన కపటప్రేమను చూపిస్తూనే.. వారికి అడ్డగోలుగా హెచ్చరికలు చేశారు.
నిజాయితీగల పోలీసు అధికారులను ఇప్పటి ప్రభుత్వం వేధిస్తున్నదట. అనేక మంది అధికార్లకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారట. ఆయన దృష్టిలో నిజాయితీ గల అధికారులు అంటే దాని అర్థం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తడం మాత్రమేనని అర్థమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానా సాగిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడం కోసం తెలుగుదేశం వారిని విపరీతంగా వేధించిన పోలీసు అధికారులు కొందరు ఇప్పుడు వీఆర్ లో ఉన్న మాట వాస్తవమే. వీఆర్ లో మాత్రమే కాదు.. జగన్ కోసం అడ్డమైన నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న అధికారులు సస్పెన్షన్లో కూడా ఉన్నారు. అయితే అందుకు కారణం ఏంటి? అచ్చంగా.. వైఎస్ జగన్ పోలీసు యంత్రాంగాన్ని తన తొత్తులుగా వాడుకోవడం వల్ల మాత్రమే జరిగిందని రాష్ట్రప్రజలు మొత్తం నమ్ముతున్నారు. ఇవన్నీ చాలా తేటతెల్లంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఎందుకంటే.. గ్రూప్ 1 ప్రశ్నపత్రాల మూల్యాంకనం కేసులో పీఎస్సార్ ఆంజనేయులు జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు. అలాగే.. ముంబాయికి చెందిన నటి కాదంబరి జెత్వానీ ని అడ్డగోలుగా అరెస్టు చేయించిన కేసులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేవలం జగన్ చెప్పినట్టుగా చేయడం, చెప్పుడు మాటలు వినడం వల్ల పోలీసులు బలైపోయారని అర్థమవుతుంది. అలాంటిది వారి కోసం ఆయన ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
ఇంతకంటె తమాషా ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి తన జమానాలో తాను కీలకపదవుల్లోకి తెచ్చిన పోలీసు అధికారుల్ని తానే లూప్ లైన్లోకి పెట్టిన ఘనుడు. తాను చెప్పినంత ఘాటుగా వేధించడం లేదని.. సీనియర్ ఐపీఎస్ లను ఏ రకంగా దూషించి.. వారిని లూప్ లైన్లలోకి పంపారో ప్రజలకు తెలియని సంగతి కాదు. ఉద్యోగాల నిరసన దీక్షలను సమర్థంగా అణచివేయలేదని డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ ను దూషించి, ఏపీపీఎస్సీ కి మార్చేశారు జగన్. అలాగే రామోజీరావును అరెస్టు చేయలేదనే ఆగ్రహంతో సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను లూప్ లైన్లోకి నెట్టారు. ఇలా తాను ఎంచుకున్న, తన అనుచరుల్లాంటి పోలీసు అధికారుల్ని తానే వేధించిన జగన్.. ఇప్పుడు వీఆర్ లో ఉన్నవారి గురించి మాట్లాడడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పోలీసులపై వైఎస్ జగన్ కపట ప్రేమ!
Friday, December 5, 2025
