రాజకీయ నాయకులు తమ సొంత డబ్బులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతుండడం అనేది మనకు కొత్త కాదు. నిజానికి రాజకీయాల్లోకి రాదలచుకుంటున్న వారు కూడా ఇలాంటి పనులు అనేకం చేస్తుంటారు. అయితే అలాంటి వారందరూ కూడా.. తమకు రాజకీయాసక్తి ఉన్న నియోజకవర్గాల పరిధిలోనే ఇలాంటి పనులు చేస్తుంటారు తప్ప.. ఎక్కడ అవసరం ఉన్నదో దానిని గుర్తించి, ఎక్కడి ప్రజలు తమకు విన్నవించుకుంటే ఆ ప్రాంతాలలో తమ సొంత డబ్బు ఖర్చు పెట్టరు. పైగా ప్రధానంగా గమనించాల్సిన విషయం ఇంకోటేంటంటే.. అధికారం లేనప్పుడు ప్రజలకోసం తమ సొంత డబ్బు వెచ్చించడానికి ఏమాత్రం వెనుకాడరు. కానీ ఒకసారి అధికారం దక్కిందంటే.. ఆ తర్వాత ప్రజలు చిన్న చిన్న అవసరాలకు అడిగినా కూడా.. ప్రభుత్వం ఫైల్ రన్ చేసి.. ప్రభుత్వం ద్వారా మాత్రమే పనులు చేయించడానికి మొగ్గుతుంటారు.
ఇలాంటి రాజకీయ నాయకులకు నవతరం నేతలు భిన్నంగా కనిపిస్తున్నారు. తమ సొంత డబ్బు పెట్టడం మాత్రమే కాదు.. ఎక్కడ అవసరమైతే అక్కడ ఖర్చు పెట్టేలా, తమ స్వప్రయోజనాలను పక్కన పెట్టేలా వారు పనులు చేపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఖర్చులు పెడుతున్నారు. నారా లోకేష్ రెండో దఫా మంత్రి అయిన తర్వాత ఇప్పటికే అలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతుండగా.. తాజాగా ఆయన బాటలో పవన్ కల్యాణ్ కూడా నడుస్తున్నారు.
కడప అనేది సాధారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లా. ఈ విడతలో అక్కడ కూటమి బాగానే సీట్లు సాధించింది. జనసేన కూడా కొడూరును గెలుచుకుంది. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ కడపలో పర్యటించినప్పుడు.. అక్కడి కలెక్టరు.. తమ ఊరిలో బడిపిల్లలకు మధ్యాహ్న భోజనం వండించేందుకు స్మార్ట్ కిచెన్ అవసరం ఉన్నదని తెలియజెప్పారు. గత ఏడాది మెగా పీటీఎం జరిగినప్పుడు పవన్ కడపకు వెళ్లారు. అప్పట్లో కలెక్టరు కోరడంతో.. పవన్ కల్యాణ్ పూర్తిగా తన సొంత నిధులతో దీనిని ఏర్పాటు చేయించారు. కడపలోని ఓట్లు తనకు పెద్దగా అవసరం పడకపోయినప్పటికీ.. ఒకమంచి పనిచేయాలనుకున్నప్పుడు చేసేయడమే అనే ధోరణిని పవన్ చాటిచెప్పారు.
నారా లోకేష్ కూడా ఇప్పటికీ అలాంటి పనులు చేస్తూ ఉండడం గమనించాల్సిన సంగతి. కడప జిల్లా కాశినాయన ఆశ్రమంలో తన సొంత డబ్బుతో షెడ్లు వేయించడం దగ్గరినుంచి చాలా పనులు చేపట్టారు. కాగా… పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు నారా లోకేష్ బాటలో నడుస్తున్నట్టుగా ఉన్నదని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పనులు చేడం విశేషం అని వ్యాఖ్యానిస్తున్నారు.
నారా లోకేష్ బాటలోనే పవన్ : కడపలో స్మార్ట్ కిచెన్!
Friday, December 5, 2025
