వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విటర్లో గానీ, ఏదో ఒకనాడు బెంగుళూరు నుంచి కదలివచ్చి జనంలోకి వెళ్లినప్పుడు గానీ ఒక మాట మాట్లాడితే.. ఇక ఆ పార్టీ నాయకులందరూ అదే మాట పట్టుకుని పాడిందే పాడుతుంటారు. ఆ క్రమంలో అటు జగన్మోహన్ రెడ్డి దగ్గరినుంచి, ఇటు ఎమ్మెల్యే స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరికీ కూడా కూడా కార్యకర్తల మీద వల్లమాలిన ప్రేమ కురిపించడం ఒక అలవాటుగా మారిపోతున్నది. వైసీపీకి చెందిన ప్రతినాయకుడూ కార్యకర్తలతో సమావేశం పెడితే చాలు.. గతంలో వారికి అన్యాయం జరిగిందని జగనన్న 2.0 ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. కార్యకర్తలను ఉద్ధరించేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెబుతున్న మాటలు.. జగన్ వైఫల్యాలను చాటిచెప్పేలా ఉన్నాయి. అయితే ఈ మాటలు జగన్ కుఅర్థమయ్యాయో లేదో అని కార్యకర్తలు అనుకుంటున్నారు.
గత ఎన్నికల్లో కేవలం వాలంటీర్ల వల్లనే ఓడిపోయాం అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, జగన్ కు ఆ విషయం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని గోపిరెడ్డి అంటున్నారు. ఆయన మాటలు స్ట్రెయిట్ గా జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నట్టుగానే ఉన్నాయి.
జగన్ వార్డు స్్థాయిలో వాలంటీర్లను నియమించుకుని.. వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేయిస్తూ.. వారిద్వారా.. ప్రతినెలా.. ఇంటింటికీ తన భజన చేయిస్తూ.. జగన్ లేకపోతే మీకు పెన్షన్లు రావు, మీ జీవితాలు ఆగమైపోతాయి అని కథలు చెప్పిస్తూ, ప్రజలను భయపెడుతూ.. వాలంటీర్లు చేస్తున్న తన భజన వల్ల మాత్రమే తాను మళ్లీ ముఖ్యమంత్రి అయిపోతానని కలగన్నారు. కార్యకర్తల గురించి ఆయన అసలు పట్టించుకోలేదు. గోపిరెడ్డి చెప్పుకోడానికి మొహమాట పడుతుండవచ్చు గానీ.. కార్యకర్తలకు మాత్రమే కాదు.. వాలంటీర్ల కారణంగా గత ప్రభుత్వ కాలంలో.. ఎమ్మెల్యేలకు కూడా ప్రజల్లో విలువలేకుండాపోయింది. జగన్ భజన తప్ప ఇంటింటి వద్ద సాగిన కార్యక్రమం మరొకటి లేదు. వాలంటీర్లు సాగించే ఈ పిచ్చి జగన్ భజనతో ప్రజలకు వెగటు పుట్టింది.
వాలంటీర్ల కారణంగా పార్టీ ఓడిపోయింది అని గోపిరెడ్డి చెప్పిన మాటల వెనుక ఉన్న అంతరార్థం అదే. మరి.. తన పార్టీ మాజీ ఎమ్మెల్యే చెబుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి చెవులకు సోకాయా లేదా? ఆయనకు వినిపించి ఉంటే అర్థమయ్యాయా లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. కనులుండీ చూడలేని వారుంటారని కొందరు అంటుంటారు.. ఇలా తన సొంత ఎమ్మెల్యేలు చెబుతున్న లోపాల్ని కూడా గ్రహించలేకపోతే.. ఇక జగన్ ను ఎవ్వరూ కాపాడలేరని ప్రజలంంటున్నారు.
