నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏమాత్రం తన జోరు తగ్గించడం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురించి అసభ్యపు కూతలు కూసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.. కనీసం పశ్చాత్తాపపడడం లేదు కదా.. పైపెచ్చు పోలీసులకే సవాలు విసురుతున్నారు. కావాలంటే వచ్చి తనను అరెస్టు చేసుకోవచ్చునని ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారు.
కోవూరులో ఓడిపోయిన ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న గురించి.. ఆయన అవినీతి గురించి ప్రశాంతిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అవినీతి గురించి కాకపోతే.. వారి పర్సనల్ లైఫ్ గురించి కూడా విమర్శలు చేయాలనే కుసంస్కారం ఆమెకు లేదు. కానీ.. ప్రసన్నకు ధైర్యముంటే తన మీద అవినీతి ఆరోపణలు నిరూపించాలని సవాలు విసరాలి.. ప్రజల ఎదుట తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. అలాంటి ప్రయత్నమేమీ చేయకుండా.. ఆయన చాలా లేకిగా, చవకబారుగా వ్యవహరించారు.
ప్రశాంతిరెడ్డి గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి అత్యంత అసభ్యంగా, అబద్ధాలు మాట్లాడారు. అవమానించారు. ఈ విషయంపై నానా రభస అయింది. మహిళా కమిషన్ కూడా కేసు నమోదు చేసింది. పైగా ప్రశాంతిరెడ్డి కూడా తన గురించి ప్రసన్న మాట్లాడిన మాటలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రపన్న కుమార్ రెడ్డి కనపడకుండా పోవడంతో.. ఆయన పారిపోయినట్టుగా ప్రచారం జరిగింది.
నల్లపురెడ్డి నెల్లూరులో తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడకూ పారిపోలేదని, చెన్నైలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చానని చెప్పుకున్నారు. అంతటితో ఆగితే చాలా బాగుండేది.
తాను నెల్లూరులోనే ఉన్నానని.. ఇప్పుడు కావాలన్నా తనను అరెస్టు చేసుకోవచ్చునని ఆయన డాంబికాలు పలికారు. అక్కడితో ఆగినా బాగానే ఉండేది. అలా కాకుండా.. ‘నాది నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్లడ్. భయపడడం మా బయోడేటాలో లేదు.’ అంటూ రెచ్చిపోయారు. తనది తండ్రి బ్లడ్ అని బహిరంగంగా చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకు ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని గురించి ఎవరైనా సందేహాలు లేవనెత్తారో కూడా తెలియదు. కానీ ప్రజలు మాత్రం.. నల్లపురెడ్డి అతి వ్యాఖ్యలు చూసి నవ్వుకుంటున్నారు.
నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మంచి పేరున్న సీనియర్ నాయకుడు. మహిళలను అసభ్యంగా తిట్టడం ఆయన బ్లడ్ నుంచే నీకు వచ్చిందా ప్రసన్నా? అని ప్రశ్నిస్తున్నారు. నీ తండ్రి బ్లడ్ లో అలాంటి అవలక్షణాలు లేవని.. అవి నీ బ్లడ్ లో మాత్రమే ఉన్నాయని వెటకారం చేస్తున్నారు.
