మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని బింబిసార సినిమాతో గుర్తింపు పొందిన వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తుండగా, యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఒకవైపు సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడుదల తేదీపై స్పష్టత రాలేదు. అయితే, తాజాగా చిత్ర బృందం నుండి వచ్చిన సమాచారం ప్రకారం సినిమాలో ఓ ప్రత్యేక గీతం మిగిలి ఉందని తెలిసింది.
ఇక విశ్వంభరలో చిరంజీవి గతంలో చేసిన ఒక పాపులర్ పాటను రీమిక్స్ చేయనున్నారని ఇండస్ట్రీ టాక్. అది కూడా అన్నయ్య సినిమాలో వచ్చిన ఆట కావాలా పాట కావాలా అనే హిట్ సాంగ్‌ని కొత్త తరహాలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటకు సంగీతాన్ని మాస్ బీట్‌లకు ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో అందించనున్నట్టు సమాచారం.
ఈ రీమిక్స్ సాంగ్‌లో చిరుతో కలిసి బాలీవుడ్ గ్లామర్ డాల్ మౌని రాయ్ స్టెప్పులేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాకి సోషియో ఫాంటసీగా ఓ విభిన్నమైన టోన్ సెట్ చేస్తున్న దర్శకుడు, ఈ స్పెషల్ సాంగ్‌తో మరింత హైప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫిషియల్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
