నాయకులు పబ్లిక్ లోకి వెళ్లి ఏదైనా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్పప్పుడు పోలీసుల అనుమతి ఎందుకు అడుగుతారు? అక్కడ జనసమ్మర్దం అనుకోనంత వచ్చినప్పుడు అవసరమైన భద్రత ఏర్పాట్లు చేస్తారని కదా! కానీ పోలీసులు స్థానికంగా ఉండే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ అనుమతులు ఇస్తారు. అనుమతి అంటూ అడిగినప్పుడు- దానిని పాటించడం కదా ధర్మం! కానీ జగన్మోహన్ రెడ్డి దళాలకు అలాంటివేమీ ఉండవు.
పోలీసులు అనుమతులు ఇవ్వడానికి అవకాశం లేనంత భారీ పరిమాణంలో తమ డిమాండ్లు వినిపిస్తారు. అడిగినంత అనుమతులు ఇవ్వకూడదనేదే వారి కోరిక. అనుమతులు ఏ స్థాయి వరకు వచ్చినా వాటిని ఉల్లంఘించాలనేది ఒక నియమంలాగా పెట్టుకుంటారు. అదే పనిగా వ్యవహరిస్తారు. పోలీసులు ఇచ్చిన అనుమతుల్ని ఖాతరు చేయకూడదు.. వారి నిబంధనల్ని ఉల్లంఘించాలి.. వారిని రెచ్చగొట్టాలి.. పోలీసులు ఏమీ చేయకపోతే- జనం ఎక్కువైనా సరే వారు పట్టించుకోలేదని గోల చేయాలి.. ఒక వేళ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే- తమ పార్టీ కార్యకర్తలను కొట్టి చంపేస్తున్నారని యాగీ చేయాలి.
మొత్తం జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయని, ఆయనకు భద్రత లేకుండా చేస్తున్నారని గోల చేయాలి.. ఇదే స్కెచ్ తో ప్రతిసారీ వ్యవహరిస్తున్నారు. ఆ మేరకు జగన్ కోరిక నెరవేరింది. ఆయన అనుకున్నట్టే జరిగింది. మామిడి రైతులను పరామర్శిస్తా అనే సాకుతో చిత్తూరుజిల్లా బంగారుపాళెం పర్యటన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టుగానే అల్లర్లు జరిగాయి. స్వల్పంగా పోలీసు లాఠీ చార్జీ కూడా జరిగింది. దానికి సంబంధం లేకుండా ఒక వ్యక్తి కిందపడి గాయపడ్డాడు. పోలీసులు అతణ్ని కొట్టి చంపేయాలనుకున్నారంటూ ఇప్పుడు గోల జరుగుతోంది.
ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి తన లక్ష్యాన్ని చాలా బాగా సాధించుకున్నారు. కార్యకర్తలు గాయపడడమూ, ఇబ్బందిపడడమూ ఇవేమీ ఆయనకు అక్కర్లేదు. పోలీసులను నిందించడానికి, ప్రభుత్వాన్ని నిందించడానికి ఆయనకు సాకులు కావాలి. అంతకు మించి మరేం లేదు.
బంగారు పాళెం రైతుల పరామర్శ యాత్ర అదేవిధంగా సాగింది. జగన్మోహన్ రెడ్డి ఏం ఒరగబెడతారని రైతులు ఆయన వద్దకు వచ్చి మొరపెట్టుకుంటారో ఎవ్వరికీ అర్థం కాని సంగతి.
కడప, తిరుపతి, చిత్తూరు, రాజంపేట జిల్లాలనుంచి పార్టీ కార్యకర్తలను తోలించడమే కాకుండా.. వారందరూ మామిడి రైతులు అంటూ చాటిచెప్పాలని చూడడం జగన్మోహన్ రెడ్డి కుటిలత్వాల్లో ఒకటి. ఇప్పుడు ఒక కార్యకర్త గాయపడడం అనేది లడ్డూలాగా కలిసి వచ్చింది. పరామర్శించడానికి కారు దిగి వెళతానని జగన్ ఓవరాక్షన్ చేస్తే.. ఎస్పీ నిలువరించడం కూడా కలిసి వచ్చింది. ఇక జగన్ ఇంకో యాత్ర ప్లాన్ చేసుకునే వరకు ఈ పాయింటుమీదనే గోల చేస్తూ బతుకుతుంటారని అర్థం చేసుకోవాలి.
