వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నాడు ఒక కొత్త చర్చ తెరమీదకు వస్తోంది. నిజానికి వైఎస్సార్ తనయ షర్మిల ఇలాంటి చర్చకు కారణం అయ్యారు. తన తండ్రి, ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయాలనే ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. ఇందుకోసం అక్కడి సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం దీనిని త్వరలోనే నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. ఇదే విషయమై సోనియాగాంధీకి కూడా లేఖ రాసినట్టుగా షర్మిల వెల్లడించారు.
షర్మిల డిమాండు ఒక రకంగా సహేతుకంగానే అనిపిస్తుంది. ఎందుకంటే.. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రిగా అతికొద్దికాలం పనిచేసిన కొణిజేటి రోశయ్యకు కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదులో సముచిత గౌరవాన్నే కల్పించింది. అలాంటిది వైఎస్ పేరుతో స్మృతివనం ఏర్పాటుకావాలని ఆయన కూతురు కోరుకోవడంలో వింతేం లేదు.
అయితే షర్మిల డిమాండు ఒక సరికొత్త చర్చను లేవదీస్తోంది. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద షర్మిలకు ఉన్న ప్రేమ.. కొడుకు జగన్మోహన్ రెడ్డిలో లేదా? అనేదే ఆ చర్చ. ఎందుకంటే.. వైఎస్ జగన్ తలచుకుని ఉంటే.. హైదరాబాదులో వైఎస్సార్ స్మృతివనం అనేది అయిదేళ్ల కిందటే ఏర్పాటు అయి ఉండేది. ఎందుకంటే.. జగన్ సీఎం అయిన తర్వాత.. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సన్నిహితమైన సంబంధాలను కొనసాగించారు. కేసీఆర్ కోరిక మేరకు తెలంగాణలో పదేళ్లు ఉమ్మడిగా వాడుకోవాల్సిన ఆస్తులన్నింటి మీద హక్కులను తెలంగాణకు రాసిచ్చేసి.. ఆరకంగా చాలా చాలా మేలు చేశారు జగన్. ఇన్ని కేసీఆర్ కోరికలను తీర్చిన తర్వాత.. తన తండ్రి కోసం హైదరాబాదులో ఒక స్మృతివనం కావాలని అడిగి ఉంటే.. కేసీఆర్ ఖచ్చితంగా ఆ కోరికను మన్నించి ఉండేవారు.
కనీసం ప్రభుత్వం ద్వారా స్థలం కేటాయింపజేసుకుని ఉన్నా కూడా సరిపోయేది. ఏపీ ప్రభుత్వం ఖర్చులతో హైదరాబాదులో వైఎస్ స్మృతివనం నిర్మించి ఉన్నా కూడా.. ఆ రోజుల్లో ఆయనను అడిగేవారు ఎవ్వరూ లేరు. కానీ.. జగన్ అలాంటి ప్రయత్నం వీసమెత్తు కూడా చేయలేదు. ఆయన నోటమ్మట.. హైదరాబాదులో వైఎస్ స్మృతివనం గురించిన మాట ఎన్నడూ రానేలేదు. కానీ ఇవాళ వైఎస్ జయంతి నాడు ఆయన కూతురు షర్మిల ఆ టాపిక్ చర్చలోకి తెచ్చారు.
షర్మిల డిమాండును బట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేస్తుందా లేదా అనేది వేరే సంగతి. కానీ.. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే.. తమ ఖర్చులతో స్మృతివనం ఏర్పాటుచేసుకుంటాం.. అనే ప్రతిపాదనతో వైఎస్సార్ అభిమానులు లేదా జగన్ లేదా షర్మిల ముందుకు వస్తే.. ప్రభుత్వం ఖచ్చితంగా స్థలం ఇవ్వగలదు. ఇటీవల నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ మెయింటెనెన్స్ సరిగా లేదని బాధపడిన నారా లోకేష్ తన ఖర్చుతో అక్కడ పనులన్నీ చేయించడానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఆ తర్వాత.. జీహెచ్ఎంసీనే కొంత నిధులను కేటాయించింది. నారాలోకేష్ స్ఫూర్తితోనైనా.. తన రాజకీయ జీవితానికి పునాదిగా తండ్రిని వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి స్మృతివనం గురించి పట్టించుకుంటే బాగుంటుందని వైఎస్ అభిమానులు అనుకుంటున్నారు.
