వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను ఇప్పుడు కొత్త సందేహం వేధిస్తోంది. 8 తేదీ మంగళవారం వైఎస్సార్ జయంతి. ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద సాధారణంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతిసారీ ఈ. రోజున ఇక్కడకు వైఎస్ కుటుంబ సభ్యులు మొత్తం హాజరు అవుతారు. ఈ ఏడాది సమాధి వద్ద జగన్, ఆయన చెల్లెలు షర్మిల పరస్పరం తారస పడితే పలకరించుకుంటారా? అనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
అన్నా చెల్లెళ్ల మధ్య ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నదని అందరికీ తెలుసు. జగన్ ఎన్నికల్లో నీచంగా ఓడిపోయినా కూడా.. ఆయన గతంలో తన పాలనాకాలంలో చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకత్వం మీద షర్మిల నిత్యం ధ్వజమెత్తుతూనే ఉన్నారు. జగన్ ను తన విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నారు. తాజాగా తన ఫోన్ ట్యాపింగ్ చేయించి తను ఎవరితో ఏం మాట్లాడుతున్నానో జగన్ విన్నాడని కూడా ఆమె అంటున్నారు. ఇన్ని రకాల గొడవల మధ్య అసలు ఇడుపులపాయలో పరస్పరం ఎదురుపడితే వీరు మాట్లాడుకోవడం జరుగుతుందా అనేది సందేహమే.
తల్లి విజయమ్మ పట్ల కూడా జగన్ విముఖంగా ఉన్నారు. మాములుగా విభేదాలు పొడసూపిన తర్వాత కూడా విజయమ్మ ఇడుపులపాయలో జగన్ కనిపిస్తే చాలు నుదుట ఒక ముద్దు పెట్టీ పంపేవారు. ఈసారి ఇద్దరి మధ్య కోర్టు కేసులు బీభత్సంగా నడుస్తున్నాయి. తల్లి కొడుకుల మధ్య కూడా మాటలు ఉండక పోవచ్చునని కొందరు అనుకుంటున్నారు.
వైఎస్సార్ కుటుంబ తగాదాలను ఈ జయంతి సందర్భంగా ఇడుపులపాయ మరెంత రచ్చ కీడుస్తుందో చూడాలి.
