కూటమి బంధం ఏర్పాటుకావడానికి ఇరుసులాగా వ్యవహరించడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసించిన జనసేనాని పవన్ కల్యాణ్ అంటే.. జగన్ దళాలు మండిపడుతూ ఉంటాయనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహరవీరమల్లు విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఇదివరకే సినిమా ఇండస్ట్రీలోని ఒక మాఫియా ముఠాను అడ్డు పెట్టుకుని ఆటంకాలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాలు అందరికీతెలుసు. తీరా ఇప్పుడు హరిహర వీరమల్లు విడుదల కాబోతుండగా.. సినిమా వ్యతిరేక ప్రచారాన్ని జగన్ దళాలు అమితంగా ప్రోత్సహిస్తున్నాయి. సినిమా మీద కొందరు కుల సంఘాల వ్యక్తులను రెచ్చగొట్టి.. న్యాయపరమైన చిక్కులు కల్పించడానికి కుట్రలు చేస్తున్నాయి.
హరిహరవీరమల్లు ఒక కల్పిత కథ. ఇలాంటి కథను తయారుచేస్తున్నప్పుడు.. చరిత్రలో హీరోయిజం ప్రదర్శించిన అనేక మంది యొక్క స్ఫూర్తి ఉండవచ్చు. కొందరి జీవితాల్లోని ఘటనలు ఈ సినిమా కథలోకి వచ్చేయవచ్చు. తెల్లదొరల తుపాకీకి ఎదురునిల్చుని కాల్చండి రా అనే సీను వచ్చిన ప్రతిసారీ అల్లూరి రామరాజు జీవితం నుంచి కాపీ కొట్టారు.. కథను మార్చేశారు అని వాగితే ప్రయోజనం ఉండదు కదా. అలాంటి నేపథ్యంలో హరిహరవీరమల్లు చిత్రం గురించి కూడా అవాకులు చెవాకులు పేలడం ద్వారా హఠాత్తుగా పాపులర్ కావాలని కొందరు కుటిల ప్రయత్నాలు చేయడం మామూలే. కానీ వారిని అనుచితంగా ప్రోత్సహించడానికి జగన్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. వారి పసలేని ప్రకటనలకు సాక్షిలో మాత్రం అపరిమిత ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని చరిత్రలో ఎక్కడా లేని కల్పిత పాత్రలతో ఈ సినిమా తీస్తున్నారని బీసీ సంఘం నాయకుడు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి శివ ముదిరాజ్ అన్నట్టుగా సాక్షిలో ప్రచురించారు. చరిత్రను వక్రీకరించే ఈ సినిమాను అడ్డుకుంటాం అని ఆయన హెచ్చరిస్తున్నట్టుగా చెబుతున్నారు.
సినిమా యూనిట్ ఈ కథ 1336లో విజయనగరం సామ్రాజ్యం స్థాపించిన హరిహర బుక్కరాయలు కథ అని చెబుతుండగా.. కాదు అని సదరు శివ అంటున్నారు. హైకోర్టుకు వెళతాం అంటున్నారు. కేవలం ప్రచారం కోసం చేసే పిచ్చి ప్రకటన కాగా.. దీనికి సాక్షి మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ.. పవన్ సినినమాలకు చిక్కులు తప్పేలా లేవు అని కుట్రనీతి ప్రదర్శిస్తోంది. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా.. హరిహరవీరమల్లు.. ప్రజల ఆదరణ చూరగొంటుందని సినిమా యూనిట్ అంటున్నారు.
పవన్ సినిమాపై జగన్ దళాల కుట్రలు షురూ!
Friday, December 5, 2025
