మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కడపజిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన రవీంద్రనాధరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారా? రప్పారప్పా నరుకుతాం అంటూ బహిరంగ సభావేదికమీదినుంచి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పోలీసుల విచారణను ఎదుర్కోబోతున్నారా? ఫ్లెక్సిలను ప్రదర్శించినందుకే కొందరు కేసులు ఎదుర్కొంటూ, జైళ్లకు వెళ్లిన నేపథ్యంలో రవీంద్రనాధరెడ్డికి కూడా జైలు యోగం తప్పదా అనే చర్చ ఇప్పుడు కడప జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. జగన్ సొంత జిల్లాలో కూడా కార్యకర్తలు మందలు మందలుగా పార్టీ నుంచి జారిపోతూ ఉంటూ.. పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుండగా.. అక్కడ కార్యకర్తల వస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు రవీంద్ర నాధరెడ్డి.
ప్రతిచోటా కార్యకర్తలనలు మాయ చేస్తున్నట్టుగానే.. ఇక్కడకూడా.. జగన్ 2.0 ఏర్పడగానే.. మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం లాంటి డైలాగులు చెప్పారు. ఆయన ప్రకారం త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయట. జగన్ గెలిచి 2.0 సర్కారు ఏర్పాటుచేస్తాడట.
ఆ తర్వాత తెలుగుదేశం నాయకులందరికీ రప్పా రప్పా సినిమా చూపిస్తాం.. రప్పా రప్పా నరుకుతాం అని రవీంద్రనాధరెడ్డి అంటున్నారు. అలాగే ప్రతి కార్యకర్త ఒక బుక్ తెరవాలని, 2.0 రాగానే ఆ బుక్ లో పేర్లున్న అందరికీ రప్పా రప్పా చేసేస్తాం అంటూ కార్యకర్తలతో నినాదాలుచేయించారు.
ఈ రప్పారప్పా వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. సమాజంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేయడానికి సిద్ధం అవుతున్నారు. పైగా రవీంద్రనాధరెడ్డి మరికొన్ని మాటలు కూడా చెప్పారు. కార్యకర్తలు కేసులకు భయపడకూడదట. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత.. ఎవరిమీద ఎక్కువ కేసులు ఉంటే.. వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట. అంటే ఏమిటన్నమాట.. తమ పార్టీ నాయకులందరినీ ఘర్షణలకు దిగమని గొడవలు చేయమని.. కేసులు నమోదు అయ్యేలా శాంతి భద్రతలను నాశనం చేయాలని రవీంద్రనాధరెడ్డి రెచ్చగొడుతున్నారన్నమాట.
ఈ అంశాల మీదనే కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే..రప్పా రప్పా వ్యాఖ్యలు తీవ్రమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా ముద్రపడ్డాయి. తెలుగుదేశం నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ మాటలు వాడినా కూడా.. మీరు అన్నట్టుగా, ఆ రకంగా మిమ్మల్ని ఎందుకు నరకకూడదు అని ప్రజలు అనుకుంటున్నారంటూ.. తాను చెప్పినట్టుగా లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. కానీ.. రవీంద్రనాధరెడ్డి అజ్ఞానంతో.. రప్పా రప్పా నరుకుతాం అంటూ తానే వ్యాఖ్యలు చేయడం ద్వారా.. పోలీసుల కేసులో ఇరుక్కునే పరిస్థితి కల్పించుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
