బుద్ధిపూర్వకంగా ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశంతోనే కారులో ఉండి ప్రమాదం చేసి ఉంటే పట్టవలసిన సెక్షన్లను డ్రైవరు తప్పిదం కారణంగా జరిగిన ప్రమాదానికి పెట్టడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పోలీసులు కేసులు పెడుతున్న తీరును న్యాయస్థానం చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్టే లెక్క. మరి ఇదే నిశిత పరిశీలన అన్ని విషయాల్లోనూ ఉండాలి కదా? ఆ కేసులో నిందితుడు- కేసు పెట్టిన వ్యక్తిని తన వద్దకు పిలిపించుకుని పది లక్షల రూపాయలు కానుకగా ఇస్తే.. ఆ ఉదంతాన్ని ఇదే కోర్టు ఏ రకంగా అర్థం చేసుకుంటుంది? కేసును సమూలంగా తారుమారు చేయగల ఇలాంటి ప్రలోభాల విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో ఇప్పుడు తేలనుంది. ఎందుకంటే.. తన కారు కింద పడి చీలి సింగయ్య మరణించిన కేసును తారుమారు చేయడానికి, జగన్ ఆయన భార్యను ప్రలోభపెట్టే ఉద్దేశంతోనే ఈ పదిలక్షల రూపాయలు ఇచ్చారు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నేరం చేసినందుకు పోలీసులు జగన్ మీద కొత్త కేసు నమోదు చేయబోతున్నారు. దీనికి సంబంధించి న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు.
లూర్థు మేరీకి జగన్ పరామర్శ వ్యవహారం, పదిలక్షల కానుక వ్యవహారం ఇప్పుడు అసలు కేసు కంటె పెద్దదిగా తయారయ్యేలా కనిపిస్తోంది. కేసును తారుమారు చేయడానికి ప్రలోభపెట్టడం కూడా నేరమే. ఆ నేరమే జగన్ చేశారు. జగన్ పదిలక్షల రూపాయలు ఇచ్చేవరకు ఒక మాట మాట్లాడిన లూర్థు మేరీ, డబ్బు పుచ్చుకున్న తరువాత జగన్ ప్యాలెస్ ప్రాంగణంలోనే మాట మార్చి పోలీసులు మీద అనుమానం వచ్చేలా నిందలు వేయడం ఇందుకు రుజువు.
‘నీకు అది నాకు ఇది’ అంటూ క్విడ్ ప్రోకో దందాలు నడిపించడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. తండ్రి ముఖ్మమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆయన లక్ష కోట్ల రూపాయలకు పైగా అవినీతి సొమ్ము కూడబెట్టారని ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్నారంటే.. అవన్నీ కూడా క్విడ్ ప్రోకో దందాలే. ఇప్పుడు లూర్థు మేరీ విషయంలో కూడా అదే క్విడ్ ప్రోకోను అనుసరిస్తున్నారు జగన్. ‘నీకు పదిలక్షలు ఇస్తా.. నాకు కేసులో ఇబ్బంది లేకుండా ఉండేలా దారి మళ్లించు..’ అని ప్రలోభపెట్టేలా ఈ పనిచేశారని అంతా అనుకుంటున్నారు.
ఇది ఖచ్చితంగా కేసును తారుమారు చేయడానికి పన్నిన కుట్ర కిందికే వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఆ ఆరోపణతోనే కేసు నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సింగయ్య మృతి కేసులో ఎలాంటి విచారణ చేయకుండా కోర్టు స్టే విధించినందున.. కొత్త కేసు విషయం, జగన్ ప్రలోభాల విషయాన్ని ముందుగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే జరిగితే.. తొలుత పెట్టిన కేసు వల్ల జగన్ మీద హైకోర్టుకు ఏర్పడిన సానుభూతి కూడా పోతుందని, ఈ ప్రలోభాల పర్వం చూస్తే కోర్టు ఆగ్రహిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
