మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన టీమ్.. తాజాగా షూటింగ్ పనులు కూడా ప్రారంభించింది. చిరంజీవి ఈ సినిమాకోసం కొంత వరకు మేకోవర్ చేసినట్టు సమాచారం. ఆయన పాత్రలో తేడాగా కనిపించబోతున్న లుక్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పుడు షూటింగ్ ముస్సోరిలో జరుగుతుంది. ఉత్తరాఖండ్‌కి చెందిన ఈ హిల్ స్టేషన్‌లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అలాగే హీరోయిన్ నయనతార కూడా ఈ షెడ్యూల్‌కి చేరింది. చిరు-నయనతార జంటపై ఒక స్పెషల్ సాంగ్‌ని కూడా ఈ షూటింగ్‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇకపోతే అనిల్ రావిపూడి స్టైల్‌లోని వినోదానికి చక్కటి కథా బలం కూడా కలిసొచ్చేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందట. గత సినిమాల్లో ఇచ్చిన హిట్లపై ఈ సినిమాతో దర్శకుడు మరింత బలంగా నిలవాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. నిర్మాణ బాధ్యతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలసి చూస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ పట్ల అభిమానుల్లో ఆసక్తి బాగానే ఏర్పడింది. చిరు కొత్తగా ఎలా కనిపిస్తాడో, ఈ సినిమాతో దర్శకుడు అనిల్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
