తమిళ స్టార్ హీరో రజినీకాంత్ నటిస్తున్న నూతన చిత్రం ‘కూలీ’ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి యాక్షన్ స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, యాక్షన్ మూమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందించినట్టు సమాచారం. ఇందులో రజినీతో పాటు తెలుగు హీరో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమా గురించి తాజా సమాచారం ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో లోకేశ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాలో చివర్లో సూర్య కనిపించిన రోలెక్స్ క్యారెక్టర్ ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపింది. కొద్ది నిమిషాల పాత్ర అయినప్పటికీ, సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో ‘కూలీ’లో కూడా ఓ శక్తివంతమైన గెస్ట్ రోల్ ఉండబోతోందట.
ఇది చాలా స్పెషల్ పాత్ర అని, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ఈ పాత్ర కోసం ఎంపిక అయ్యాడని ఫిలింస్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా చివరిలో వచ్చే ఈ పాత్ర కథను కొత్త దిశగా మలుపు తిప్పేలా ఉంటుందట. అమీర్ ఖాన్ స్క్రీన్ మీద కనిపించగానే థియేటర్లో పండగలా ఫీల్ వచ్చేలా ఉంటుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాను ఆగస్టు 14న భారీ స్థాయిలో విడుదల చేయడానికి యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా పూర్తయ్యిందన్న విషయంతో పాటు ఈ కొత్త క్యామియో వార్త, అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ‘విక్రమ్’లో రోలెక్స్ ఎంత సంచలనంగా నిలిచిందో, ఇప్పుడు ‘కూలీ’లో అమీర్ ఖాన్ పాత్ర కూడా అంతే స్థాయిలో ఆకట్టుకుంటుందని ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.
