వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని మించిన అత్యంత కీలక నాయకుడు, గతంలో సకల శాఖల మంత్రిగా అప్రకటిత బాధ్యతలు నిర్వర్తించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పుడు పరారీలోకి వెళ్లనున్నారా? అమరావతి మహిళల గురించి, అమరావతి ప్రాంత ప్రజల గురించి సంకర తెగ అంటూ చేసిన వ్యాఖ్యలు.. తీవ్రమైన నాన బెయిలబుల్ కేసుల రూపంలో ఆయన మెడకు చుట్టుకోబోతున్నాయా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తోంది. ఆయన మీద తాజాగా తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయిన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు అరెస్టు తప్పించుకోవాలంటే.. పరారీలోకి వెళ్లడం తప్ప సజ్జలకు మరొక మార్గం కూడా లేదని పలువురు అంచనా వేస్తున్నారు.
అమరావతి అనేది వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు సాక్షి చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా నిరసన జ్వాలలను రాజేశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు ల మీద కేసులు పెట్టారు. వారిద్దరూ అరెస్టు అయి ప్రస్తుతం రిమాండులో ఉన్నారు కూడా. అయితే సాక్షి కార్యాలయాల వద్ద అదేరోజున ప్రజలు తమ తమ నిరసనలను తెలియజేశారు. ఆ సందర్భంలో.. ఆ నిరసనలను ఖండించడం కోసం మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామక్రిష్ణారెడ్డి.. తన నోటిదురుసుతనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. నిరసనలు చేస్తున్న వారిని పిశాచాలుగా, రాక్షసులుగా అభివర్ణిస్తూ వారందరూ సంకర తెగకు చెందిన వారని ఆయన మీడియాముఖంగా అన్నారు.
అమరావతిని వేశ్యల రాజధాని అన్న తరహాలోనే.. ఈ వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదమే అయ్యాయి. ఏపీ డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరితే.. సజ్జల హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 18వ తేదీ వరకు సజ్జల మీద ఎలాంటి కఠిన చర్యలకు ఉపక్రమించవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఒకవైపు ఈ మధ్యంతర ఉత్తర్వుల రక్షణ ఉన్నదిగానీ.. సజ్జలకు పరారీలోకి వెళ్లవలసిన అగత్యం తప్పేలా లేదు.
ఎందుకంటే.. తాజాగా ఎస్సీ కార్పొరేషన్ డైరక్టర్ కంభంపాటి శిరీష సహా మరికొందరు ఎస్సీ మహిళలు కలిసి.. సజ్జల మీద ఎట్రాసిటీ కేసు పెట్టారు. కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఇలాంటి కేసులోనే అరెస్టు అయిన నేపథ్యంలో సజ్జల అరెస్టు కూడా తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కోర్టు అరెస్టునుంచి రక్షణ కల్పించాలన్నా.. అలాంటి ఉత్తర్వులు వచ్చేదాకా సేఫ్ గా ఉండాలన్నా కూడా.. సజ్జల రామక్రిష్ణారెడ్డి ఎదుట ఉన్న మార్గం పరారీలోకి వెళ్లడం మాత్రమేనని పలువురు అంచనా వేస్తున్నారు.
నో అదర్ వే : పరారీ లోకి సజ్జల!
Saturday, December 6, 2025
