టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ముందుకు సాగుతున్నాడు. బాలీవుడ్‌లో ‘వార్ 2’ అనే భారీ పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మరో యాక్షన్ ప్యాక్డ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి భారీ అంచనాలు కూడా ఇప్పటికే నెలకొన్నాయి. ఇవే కాకుండా తమిళ డైరెక్టర్ నెల్సన్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ మూడింటికంటే ఎక్కువగా ఇప్పుడు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే కొత్త ప్రాజెక్ట్‌నే ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ మైథలాజికల్ కాన్సెప్ట్‌ను రూపొందిస్తున్నాడని, ఆ కథకు ఎన్టీఆర్‌ను హీరోగా తీసుకుంటున్నాడని, ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో ఈ వార్త వేగంగా వైరల్ అవుతోంది.
ఈ సినిమా కథ ‘కుమారస్వామి’ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సాధారణంగా కుమారస్వామి కథ అంటే చాలామందికి తెలిసినంత వరకే ఉంటుంది. వినాయకుడు, కుమారస్వామి మధ్య మూడు లోకాల ప్రదక్షిణ పోటీ జరిగింది. ఈ క్రమంలో వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగి విజేతగా నిలిచాడు. దీంతో బాధపడ్డ కుమారస్వామి భూమిపైకి వచ్చి అక్కడే కొలువుదీరి భక్తుల ఆరాధన పొందుతున్నట్టు కథలుగా విన్నాం.
కానీ ఈ కథలోని తెలియని కోణాలను, అదనపు అంశాలను త్రివిక్రమ్ తనదైన శైలిలో ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. పౌరాణిక నేపథ్యంతో ఓ విభిన్నమైన స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలు, విజువల్స్‌తో సినిమా తీయబోతున్నట్టు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతోందని సినీ వర్గాల టాక్.
ఇక ఈ ప్రాజెక్ట్‌పై నాగవంశీ తన సోషల్ మీడియా ద్వారా క్లూ ఇచ్చినప్పటి నుంచి ఈ కథపై ఆసక్తి పెరిగిపోయింది. ‘కుమారస్వామి కథ అంటే ఏంటి?’, ‘త్రివిక్రమ్ ఎలా డీల్ చేస్తాడు?’ అనే క్యూరియాసిటీ ఆడియెన్స్‌లో క్రియేట్ అయింది. త్రివిక్రమ్ స్టైల్లో పౌరాణిక కథ ఎలా ఉంటుందా అనే దానిపై సినిమా అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లోనూ పెద్దగా ఆసక్తి ఏర్పడింది.
ఇలా ఈ కొత్త మూవీ గురించి ఒక్క క్లూ బయటపడగానే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్లీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టాపిక్‌గా మారిపోయింది.
